మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటాం. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ బెదిరించాడని, ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌కు వ్యతిరేకంగా, ఓ యూనియన్‌ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు.
శాంతి మంత్రమే
అల్లరిమూకలతో టాటా మోట్సార్‌లో దాడులకు తెగపడ్డాడు.రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్‌ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్‌లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది.
ఎక్కడా తలవంచలేదు
ఇలా, లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్‌స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో.. దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.
టాటాను చంపేందుకు కుట్ర
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్‌స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన కాంపిటీటర్‌లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు.
టాటా మోటార్స్ లేబర్ ఎన్నికలు సజావుగా జరిగేలా గ్యాంగ్‌స్టర్‌తో వ్యవహరించేటప్పుడు రతన్ టాటా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా..శాంతి యుతంగా తాను ఆ సమస్య నుంచి బయటపడిన విధానం, తీసుకున్న నిర్ణయాల పట్ల తానెప్పుడు చింతించలేదని రతన్ టాటా ఆ వీడియోలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment