ఉప్పు నుంచి ఉక్కు వరకు.
టీ నుంచి ట్రక్ వరకు..
వాచెస్ నుంచి హోటెల్స్ వరకు..
కెమికల్స్ నుంచి కార్స్ వరకు..
ఇలా పదుల సంఖ్యలో కంపెనీల్ని ముందుండి నడిపించిన గొప్ప లీడర్.
వందల ఏళ్ల చరిత్ర..
150 కి పైగా దేశాల్లో కంపెనీలు..
10 లక్షల మందికి పైగా ఉద్యోగులు..
28 కి పైగా లిస్టెడ్ కంపెనీలు..
రూ.27.61 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ (డిసెంబర్ 26,2023 నాటికి) భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీని నడిపిస్తూ ఇసుమంతైనా గర్వం లేని పద్మ విభూషణుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా.
డిసెంబర్ 28న రతన్ టాటా 86వ జన్మదినం సందర్భంగా కోట్లాది మంది అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో రతన్ టాటా కోట్లాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సందర్భాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవేంటంటే
ఈ కుక్క మీదేనా
రతన్ టాటాకి మూగజీవాలంటే ప్రాణం. ఓ సారి ముంబై వీధుల్లో గాయాల పాలైన ఓ కుక్కను గమనించారు. వెంటనే దానికి చికిత్స చేయించారు. అనంతరం ఆ కుక్క గురించి వివరాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ముంబైలోని నా ఆఫీస్ సమీపంలో గాయాలపైన ఓ కుక్కను గుర్తించాం. అత్యవసర చికిత్స కోసం సియాన్ ఆస్పత్రికి తరలించాం. మీరు ఆ కుక్క సంరక్షకులైతే కొన్ని ఆధారాలతో reportlostdog@gmail.comకు ఇమెయిల్ చేయండి” అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ కుక్క ప్రస్తుతం మా సంరక్షణలోనే ఉంది. చికిత్సను చేయిస్తున్నాం అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఒకే ఒక్కడు.. గ్యాంగస్టర్, అతని 200 గూండాలతో
రతన్ టాటా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత ఓ గ్యాంగ్‌స్టర్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు.
వాస్తవానికి అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న కొంత మంది కార్మికులను ఒక గ్యాంగ్‌స్టర్ ప్రేరేపించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు.
గ్యాంగ్‌స్టర్ తన అనచరులైన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్‌లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. సిబ్బంది విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో భయబ్రాంతులైన ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు బయపడి పోయారు. దీంతో ‘‘ నాన్న పందులు గుంపులుగా..గుంపులుగా వస్తే సింహం సింగిల్ వస్తుందంటూ’’ రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి గ్యాంగ్‌స్టర్‌ను ఎదుర్కొన్నారు.
రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్‌లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఓ గ్యాంగ్‌స్టర్‌ను రతన్ టాటా చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు.
16 ఏళ్ల యువకుడికి సాయం..
మహరాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అర్జున్ దేశ్ పాండే 16 ఏళ్ల వయస్సులో ఉండగా తనకు ఓ హృదయ విదారకరమైన సంఘటన ఎదురైంది. దేశ్ పాండే ఓ రోజు ఫివర్ ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపుకి వెళ్లాడు. అయితే ఆ షాప్ వద్ద 70 ఏళ్ల వృద్దుడు క్యాన్సర్‌తో బాధపడుతూ తన భార్యకు కావాల్సిన మెడిసిన్ కోసం అదే షాపుకు వచ్చాడు. తన కావాల్సిన మెడిసిన్ ఈ షాప్‌లో ఉన్నా.. అత్యధిక ధర కావడంతో తాను ఆ మెడిసిన్‌ను కొనలేకపోతున్నానంటూ బాధపడటాన్ని గమనించాడు. కానీ ఏం చేయలేకపోయాడు.
ఆ బాధలో నుంచి జనరిక్ ఆధార్ అనే స్టార్టప్ పుట్టింది. అర్జున్ దేశ్ పాండే దీనిని స్థాపించాడు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశ్యం దేశ వ్యాప్తంగా ఉన్న 80 - 90 శాతం తగ్గింపుతో జనరిక్ మెడిసిన్ అందిస్తుంది. ఓ రోజు తనకు ఎదురైన సంఘటన, స్టార్టప్ ప్రారంభం వంటి అంశాలను అర్జున్ టెడెక్స్‌లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన రతన్ టాటా సైతం వెంటనే జనరిక్ ఆధార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ అక్షరాల రూ.500 కోట్లు.
ఒక్క ఫోన్ కాల్‌తో
భారత్‌లో స్టార్టప్ జపం నడుస్తోంది. ఏదైనా బిజినెస్ చేయాలంటే జనాన్ని ఆకట్టుకోవాలి. అలాంటి బిజినెస్ ఐడియా ఉంటే చాలు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఆ బిజినెస్ ఐడియాను అప్లయ్ చేస్తే చాలు కోట్లు కొల్లగొట్టొచ్చు. ఇలాగే ‘రెపోస్ ఎనర్జీ’ ఫౌండర్లు, భార్య భర్తలైన చేతన్ వాలుంజ్, అతిధి బోస్లే వాలుంజ్‌లు అనుకున్నారు. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, నిత్యవసర వస్తువులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. అదే వినియోగదారులకు కావాల్సిన పెట్రోల్‌ను మనం ఎందుకు డెలివరీ చేయకూడదు అని అనుకున్నారు.
ఐడియా బాగుంది. చేతిలో తగినన్ని నిధులు లేవు. పైగా ప్రజల్లోకి కంపెనీ పేరును బలంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే సాయం కోసం రతన్ టాటా ఆఫీస్ డోర్ తట్టారు. ఓ లెటర్‌ను రతన్ టాటాకు పంపారు. ప్రయత్నం అయితే చేశారు కానీ మనసులో ఎక్కడో చిన్న అనుమానం. టాటాకు పంపిన లెటర్ అందుతుందా? ఆ లెటర్ చదివి టాటా తమకు సాయం చేస్తారా? ఇలా ఎన్నో రకాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేశారు రతన్ టాటా. ‘మీ లెటర్ నేను చదివాను. ఒక్కసారి మనం కలుసుకోగలమా? అంటూ రతన్ టాటానే స్వయంగా చేతన్, అతిధిలకు ఫోన్ చేశారు. కట్ చేస్తే రెపోస్ ఎనర్జీ రూ.200 కోట్ల విలువైన కంపెనీ ప్రసిద్ధి కెక్కింది.
మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ
రతన్ టాటా తన పెంపుడు కుక్కలు టాంగో, టిటో అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. టాటాకు యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కరించేందుకు సిద్ధమైంది. అవార్డ్ ఇస్తున్నట్లు ప్రిన్స్ చార్లెస్ టాటాకు సమాచారం అందించారు. అ తర్వాత ముందుస్తు ప్లాన్ ప్రకారం.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హోమ్ ప‍్యాలెస్‌లో అవార్డ్‌ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డ్‌ల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? టాంగో, టిటోల వల్లే.
తాను లండన్ బయలు దేరే ముందు టాంగో, టిటోలు అనారోగ్యానికి గురయ్యాయని, వేడుకకు తాను రాలేకపోతున్నాననే సమాచారాన్ని తనతో పాటు లండన్ వచ్చేందుకు సిద్ధమైన వ్యాపార వేత్త సుహెల్ సేథ్‌కి ఫోన్ చేసి సమాచారం అందించారు.
ఇదే విషయం ప్రిన్స్ చార్లెస్‌కు చెప్పగా.. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ ప్రశంసలు కురిపించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. అందుకే రతన్ టాటా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment