న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. దీనిలో భాగంగా చమురు, రసాయనాల(ఆయిల్ టు కెమికల్స్–ఓటూసీ) విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. తదుపరి కంపెనీలో సౌదీ అరామ్‌కో వంటి వ్యూహాత్మక విదేశీ ఇన్వెస్టర్‌కు వాటాను విక్రయించనుంది. తద్వారా వాటాదారులకు మరింత విలువను చేకూర్చాలని యోచిస్తోంది. ఓటూసీ బిజినెస్‌కు మాతృ సంస్థ నుంచి 25 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.81 లక్షల కోట్లు) రుణం లభించనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ద్వారా ఓటూసీ వేల్యూ చైన్‌లో లభించనున్న అవకాశాలపై దృష్టిపెట్టేందుకు వీలు చిక్కనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో సొంతంగా మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశముంటుందని వివరించింది. కంపెనీ కోసం ప్రత్యేకించిన యాజమాన్య టీమ్, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం.. తదితరాలతో పటిష్టతను సంతరించుకోనుందని పేర్కొంది.
హోల్డింగ్ కంపెనీగా..
ఆర్‌ఐఎల్‌కు చెందిన చమురు రిఫైనరీ, పెట్రోకెమికల్ ఆస్తులు, రిటైల్ ఇంధన బిజినెస్‌లతో ఓటూసీ ఏర్పాటుకానుంది. అయితే ఆయిల్, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కేజీ డీ6 క్షేత్రాలు, టెక్స్‌టైల్ బిజినెస్‌లు ఓటూసీలో భాగం కాబోవని ఆర్‌ఐఎల్ వెల్లడించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ తదుపరి ఆర్‌ఐఎల్ కేజీ–డీ6తో కూడిన చమురు, గ్యాస్ వెలికితీత, ఉత్పత్తి బిజినెస్‌లతోపాటు.. ఫైనాన్షియల్ సర్వీసులు, ట్రెజరీ, టెక్స్‌టైల్ బిజినెస్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా నిలవనుంది.
ఇతర బిజినెస్‌లు...
ఆర్‌ఐఎల్ గ్రూప్‌లోని రిటైల్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహిస్తోంది. టెలికం, డిజిటల్ వెంచర్స్‌ను జియో ప్లాట్‌ఫామ్స్ కలిగి ఉంటుంది. రిలయన్స్ రిటైల్‌లో 85.1 శాతం, వాటా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 67.3 శాతం చొప్పున ఆర్‌ఐఎల్‌కు వాటాలున్నాయి. మిగిలిన రూ. 2 లక్షల కోట్ల విలువైన వాటాలను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఫేస్‌బుక్, గూగుల్ తదితరాలకు కేటాయించిన విషయం విదితమే. పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్న ఓటూసీకి ఫ్లోటింగ్ రేటుపై పదేళ్ల కాలానికి రుణాన్ని ఆర్‌ఐఎల్ అందించనుంది. ఈ రుణాలను చమురు, గ్యాస్ రంగంలో ఆస్తుల కొనుగోలుకి ఓటూసీ వినియోగించనుంది. వచ్చే ఏడాది(2021–22) ద్వితీయార్థంలో ఓటూసీ ఏర్పాటుకు అన్ని అనుమతులూ లభించగలవని ఆర్‌ఐఎల్ అంచనా వేస్తోంది.
ఓటూసీలో భాగం
ప్రత్యేక కంపెనీగా ఆవిర్భవించనున్న ఓటూసీకి ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ ప్లాంట్లు, తయారీ యూనిట్లతోపాటు.. బ్రిటిష్ పెట్రోలియంతో ఏర్పాటు చేసిన ఇంధన రిటైల్ మార్కెటింగ్ జేవీలో ఆర్‌ఐఎల్‌కు గల 51 శాతం వాటా బదిలీకానుంది. సింగపూర్, యూకేలలోని అనుబంధ చమురు ట్రేడింగ్ సంస్థలు, ఉరుగ్వే పెట్రో మార్కెటింగ్ సంస్థను సైతం సొంతం చేసుకోనుంది. గుజరాత్, మహారాష్ట్ర మధ్య ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇథేన్ పైప్‌లైన్, సిబూర్ జేవీలో ఆర్‌ఐఎల్‌కుగల దాదాపు 75 శాతం వాటాను పొందనుంది.
Comments
Please login to add a commentAdd a comment