చెన్నై: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో సీఎన్‌జీ వేరియంట్లను త్వరలో పరిచయం చేయనుంది. తొలుత ట్రైబర్, కైగర్ ఆ తర్వాత క్విడ్ సీఎన్‌జీ రానున్నాయి. కొన్ని నెలల్లో కంపెనీ ప్రవేశపెట్టదలచిన ఆరు కొత్త మోడళ్ల కంటే ముందే ఈ సీఎన్‌జీ వేరియంట్లు దర్శనమీయనున్నాయని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.
భారత్‌లో 2023లో సీఎన్‌జీ ఆధారిత ప్యాసింజర్ వెహికిల్స్ 5.24 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ సంఖ్య 4.8 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. కాగా, కంపెనీ విడుదల చేయనున్న మోడళ్లలో సరికొత్త బి–సెగ్మెంట్ ఎస్‌యూవీ, సి–సెగ్మెంట్ ఎస్‌యూవీ, రెండు ఈవీలతోపాటు ఆధునీకరించిన ట్రైబర్, కైగర్ ఉన్నాయి.
రెనో ఇండియా ప్రత్యేక ఫీచర్లతో ట్రైబర్, కైగర్, క్విడ్ మోడళ్లలో నైట్ అండ్ డే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను బుధవారం ప్రవేశపెట్టింది. లిమిటెడ్ ఎడిషన్‌లో 1,600 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచామని వెంకట్రామ్ తెలిపారు. గతేడాది మాదిరిగానే 2024లో 53,000 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని రెనో ఇండియా అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment