భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో (Bharat Mobility Global Expo 2025) కనులపండువగా సాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆటోమొబైల్ ఎక్స్ పో వేదికగా పలు కార్లు, టూవీలర్ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి.
హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త మోడళ్లు
హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికగా నాలుగు ద్విచక్ర వాహన మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, ఎక్స్‌ప్లస్ 210 పేరుతో రెండు మోటార్స్ బైకులు లాంచ్ చేసింది. స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలో ఎక్స్‌మ్ 125, ఎక్స్‌మ్ 160 రెండు సరికొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆవిష్కరణలతో ప్రీమియం బ్రాండ్లు ఎక్స్‌ట్రీం, ఎక్స్‌ప్లస్‌లు మరింత బలోపేతమయ్యాయని కంపెనీ సీఈఓ నిరంజన్ తెలిపారు. వీటి బుకింగ్స్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మార్చి నుంచి డెలీవరి ఉంటుంది.
యమహా
యమహా (Yamaha) తమ పెవిలియన్‌లో RX- 100, RD-350 వంటి లెజెండరీ మోటార్‌సైకిళ్లతోపాటు ప్రీమియం శ్రేణి మొదటి తరం మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ప్రముఖ YZF-R15, మస్కులర్ FZ సిరీస్‌లు ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్
హ్యుండై మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్‌ను (Hyundai CRETA Electric) విడుదల చేసింది. పరిచయ ఆఫర్‌లో ధర రూ.17.99 లక్షలు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 390 కిలోమీటర్లు, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 473 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
కియా ఈవీ6 అప్‌గ్రేడెడ్ వర్షన్
దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా తాజాగా ఈవీ6 అప్‌గ్రేడెడ్ వర్షన్‌ను (Kia EV6) పరిచయం చేసింది. 84 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లకుపైగా పరుగెడుతుందని కంపెనీ ప్రకటించింది. 350 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్‌తో 10 నుంచి 80 శాతం చార్జింగ్ 18 నిముషాల్లో అవుతుంది. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు.
బీఎండబ్ల్యూ మేడిన్ ఇండియా ఈవీ
జర్మనీ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ (BMW) భారత్‌లో తయారైన ఎలక్ట్రిక్ వెహికిల్ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. ధర రూ.49 లక్షలు. 66.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 531 కిలోమీటర్లు పరుగెడుతుంది.
మైబహ్ కొత్త ఈవీ
మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్ ఈక్యూఎస్ మైబహ్ ఎస్‌యూవీ (Mercedes-Benz Maybach EQS SUV) 680 నైట్ సిరీస్‌ను విడుదల చేసింది. ధర రూ.2.63 కోట్లు. గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో చేరుకుంటుంది. మైబహ్ జీఎల్‌ఎస్ 600 నైట్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను రూ.3.71 కోట్ల ధరతో ప్రవేశపెట్టింది. అలాగే సీఎల్‌ఏ క్లాస్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.
టాటా మోటార్స్
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ పలు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. వీటిలో హ్యారియర్ ఈవీ, అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్, టాటా సియర్రా ఎస్‌వీ, టాటా ఇంట్రా వాహనాలున్నాయి.
టయోటా
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ అద్భుతమైన ఉత్పత్తులను, అధునాతన సాంకేతికతలను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment