న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్‌లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.
మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్‌తో పాటు కైగర్, ట్రైబర్‌లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్‌లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment