దేశీ ప్రైమరీ మార్కెట్లలో తాజాగా ఒక విచిత్రమైన రికార్డ్ నమోదైంది. కేవలం రూ.12 కోట్ల సమీకరణకు ఒక చిన్నతరహా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే కనీవినీ ఎరుగని రీతిలో రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన రీసోర్స్‌ఫుట్ ఆటోమొబైల్ కంపెనీ యమహా ద్విచక్ర వాహన డీలర్‌గా వ్యవహరిస్తోంది. అదికూడా రెండు ఔట్‌లెట్లను మాత్రమే కలిగి ఉంది. 2018లో ఏర్పాటైన సంస్థ 8 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023 డిసెంబర్ 28న సెబీకి దాఖలు చేసిన ఐపీవో ప్రాస్పెక్టస్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు సాధిస్తున్న రికార్డుల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీల(ఎస్‌ఎంఈలు) ఐపీవోలకూ ఇటీవల భారీ డిమాండ్ నెలకొంటోంది. వెరసి తాజాగా ఐపీవోకు వచ్చిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఏకంగా 419 రెట్లు అధికంగా సబ్‌స్రైబ్ అయింది. సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండుతో యమహా డీలర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీసింగ్ చేపడుతోంది.
ఇన్వెస్టర్ల నుంచి హెవీ రష్
ఈ నెల 22న ప్రారంభమై 26న ముగిసిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవోలో భాగంగా 9.76 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 40.76 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. రూ.12 కోట్ల సమీకరణకు తెరతీస్తే ఏకంగా రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కేటగిరీలో 316 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 496 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూకి తొలి రోజు 10.4 రెట్లు, రెండో రోజు 74 రెట్లు అధికంగా స్పందన లభించింది. చివరి రోజుకల్లా బిడ్డింగ్ తుఫాన్ సృష్టించింది. షేరుకి రూ.117 ధరలో మొత్తం 10.25 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాహ్నీ ఆటోమొబైల్ లిస్ట్‌కానుంది.
ఇదీ చదవండి: భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవా
ఎస్‌ఎంఈలకు కనిపిస్తున్న అనూహ్య డిమాండ్ అసంబద్ధమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడుల వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్టర్లు నాణ్యతా సంబంధ విషయాలను సైతం విస్మరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధిక సబ్‌స్క్రిప్షన్‌వల్ల తాత్కాలికంగా లాభాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొంత నిరాశ కలిగించవచ్చన్నారు. అయితే కంపెనీ బిజినెస్‌పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టే వారు తక్కువవుతున్నారని ఆందోళన వ్యక్తి చేశారు. నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ వేలంవెర్రి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఎస్‌ఎంఈ ప్లాట్ ఫామ్ ద్వారా లిస్టయ్యే కంపెనీల ఖాతాలను మరింత అప్రమత్తంగా ఆడిటింగ్ చేయమంటూ గత వారం సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అశ్వనీ భాటియా చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏలు)కు సూచించడం గమనార్హం.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment