న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటా వైస్ప్రెసిడెంట్‌గాకూడా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో మెటా యాజమాన్యం సంధ్యా దేవనాథ్‌ను నియమించింది. 2023 జనవరి1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించ నున్నారని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మెటా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన తరువాత సంధ్యా దేవనాథన్‌ను మెటా ఇండియా కొత్త హెడ్‌గా నియమించడం విశేషం. 2000లో ఢిల్లీ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన సంధ్యా నూతన పదవీ బాధ్యతలను స్వీకరించేందుకు త్వరలోనే ఇండియాకు రానున్నారు.
గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా పేరొందిన సంధ్యా దేవనాథన్‌కు బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతికతలో 22 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది. 2016 నుంచి సంధ్యా దేవనాథన్ మెటాలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) మార్కెట్‌లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ బోర్డ్‌లో కూడా పనిచేస్తున్నారు.
కాగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇండియా హెడ్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఇటీవల రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించిన కొన్ని రోజులకే వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment