
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పలు నిబంధనలను సరళతరం చేసేందుకు నిర్ణయించింది. గురువారం నిర్వహించిన సమావేశంలో సెబీ బోర్డు కొన్ని మార్గదర్శకాలలో అవసరానికి అనుగుణమైన సవరణలు చేపట్టేందుకు అంగీకరించింది.
దీనిలో భాగంగా నిధుల అవసరాలకుగాను భారీ కార్పొరేషన్లు చేపట్టే రుణ సెక్యూరిటీల జారీ నిబంధనలను సరళీకరించనుంది. అంతేకాకుండా కంపెనీలుకాని లిస్టెడ్ సంస్థలలో ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేయని సొమ్మును ఇన్వెస్టర్ల పరిరక్షణ, ఎడ్యుకేషన్ ఫండ్(ఐపీఈఎఫ్)కు బదిలీ చేసే మార్గదర్శకాలనూ క్రమబద్ధీకరించనుంది.
రీట్స్, ఇన్విట్స్ నుంచి అన్‌క్లెయిమ్డ్ నిధులను జమ చేయడంతోపాటు ఐపీఈఎఫ్ నుంచి రిఫండ్ విధానాలనూ సవరించనుంది. ఈ బాటలో నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్‌కు అర్హతల పెంపు, ఎక్స్‌పీరియన్స్ సాధించడంలో గడువును సైతం పెంచనుంది.
2025 సెప్టెంబర్‌వరకూ గడువును పెంచేందుకు సెబీ బోర్డ్ నిర్ణయించింది. సెక్యూరిటీల మార్కెట్లో కనిపిస్తున్న టెక్నలాజికల్ ట్రెండ్స్ తదితర విభిన్న ట్రెండ్స్‌పైనా సెబీ బోర్డు చర్చించింది. సెబీ సైతం మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టనుంది.