
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీకి శుక్రవారం బ్రేక్ పడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా వారాంతాపు రోజున సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 65,280 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం 30 షేర్లకు గానూ 25 షేర్లూ నష్టపోయాయి. నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించి 19,332 వద్ద నిలిచింది. ఈ సూచీ 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడినట్లైంది.
సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. దేశీయంగా నెలకొన్న సానుకూలతల అండతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోవడమే కాకుండా స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 113 పాయింట్లు బలపడి 65,899 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 19,524 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను నమోదు చేయగలిగాయి. అయితే ఫైనాన్స్, ఐటీ, ఆయిల్ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో మళ్లీ నష్టాల బాటపట్టాయి.
మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.76%, 0.28% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.790 కోట్ల షేర్లను కొన్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 562 పాయింట్లు, నిఫ్టీ 143 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు క్షీణించి 82.73 స్థాయి వద్ద స్థిరపడింది.
‘‘అమెరికాలో ప్రైవేటు రంగ ఉద్యోగ కల్పన అనూహ్యంగా పెరగడంతో వడ్డీరేట్ల పెంపు అంచనాలు తెరపైకి వచ్చాయి. బాండ్లపై రాబడి సైతం పెరిగింది. ఈ పరిణామాలకు తోడు సూచీలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతుండటం, వారాంతపు రోజు కావడంతో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
ఐడియా ఫోర్జ్ షేరు లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్‌ఈలో కంపెనీ ఇష్యూ ధర (రూ.672)తో పోలిస్తే 94% ప్రీమియంతో రూ.1305 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 100 శాతం మేర దూసుకెళ్లి రూ.1,344 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 93 శాతం లాభంతో రూ.1,295.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ మొత్తంలో 6.50 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. లిస్టింగ్ తొలిరోజున కంపెనీ మార్కెట్ విలువ రూ.5,398 కోట్లుగా నమోదైంది.
వజ్రాభరణాల తయారీ, విక్రయ సంస్థ టైటాన్ షేరు మెరిసింది. బీఎస్‌ఈలో 1.25% లాభపడి రూ.3145 వద్ద ముగిసింది. రూ.3211 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ ఆదాయం 20 శాతం వృద్ధి చెందడంతో ఈ షేరుకు డిమాండ్ లభించింది.
నష్టాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% నుంచి 1.50% లాభపడ్డాయి. ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు ఒకశాతం పెరిగాయి.