ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉన్నా, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల జోరు కారణంగా స్టాక్ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఇంట్రాడేలో 375 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 98 పాయింట్లు పతనమై 38,757 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 11,440 పాయింట్ల వద్దకు చేరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి గతంలో అంచనా వేసిన మైనస్ 5% కంటే మరింత దిగువకు మైనస్ 9%కి పడిపోతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొనడం, ఐటీ షేర్లు మెరుపులు మెరిపించినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ జోడీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వంటి బ్లూచిప్‌లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి 5 పైసలు పెరిగి 73.48కు చేరింది.
ఐటీ షేర్లు...అదరహో...: ఈ క్యూ2లో తమ ఆదాయం, నిర్వహణ మార్జిన్‌లు అంచనాలకు మించి పెరుగుతాయని ప్రకటించడంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 10 శాతం లాభంతో రూ.794 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. హెచ్‌సీఎల్ మార్కెట్ క్యాప్ రూ.19,715 కోట్లు ఎగసి రూ.2,15,384 కోట్లకు చేరింది. ఈ జోష్‌తో మిగిలిన ఐటీ షేర్లు కూడా వెలుగులు విరజిమ్మాయి. టీసీఎస్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.2,504ను తాకింది. చివరకు 5 శాతం లాభంతో రూ.2,492 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 9.35 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన రెండో భారత కంపెనీ ఇది. గత ఏడాది అక్టోబర్‌లోనే ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.15 లక్షల కోట్లకు మించింది.
∙భారతీ ఎయిర్‌టెల్ షేర్ 3 శాతం నష్టంతో రూ.475 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
∙దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎల్ అండ్ టీ, డిక్సన్ టెక్నాలజీస్, ఎస్కార్ట్స్, మైండ్ ట్రీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
∙ఫ్యూచర్ గ్రూప్ షేర్ల పతనం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment