2024లో పెట్టుబడులకు దారేది..? | TOP 5 Best Investment Options in India in 2024 | Sakshi
Sakshi News home page

2024లో పెట్టుబడులకు దారేది..?

Published Mon, Jan 22 2024 5:37 AM | Last Updated on Mon, Jan 22 2024 7:37 AM

TOP 5 Best Investment Options in India in 2024 - Sakshi

ఇన్వెస్టర్లు ఏడాదికోసారి తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తప్పకుండా సమీక్షించు కోవాలి. అప్పుడే ఏ విభాగానికి ఏ మేరకు కేటాయింపులు చేయాలన్న స్పష్టత వస్తుంది. ఈక్విటీలు ఆల్‌టైమ్‌ గరిష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వడ్డీ రేట్లు సైతం గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. క్యాపిటల్‌ మార్కెట్లపై ఈ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.

ఈక్విటీ, డెట్, బంగారం, రియల్‌ ఎస్టేట్‌.. వీటిల్లో ఏ విభాగం పనితీరు ఎలా ఉంటుంది..? ఇది తెలిస్తే.. తమ పెట్టుబడుల్లో వేటికి ఎంత మేర ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులను ఒడిసి పట్టుకోవచ్చు. అంతేకాదు, మార్కెట్‌ అస్థిరతలను తట్టుకునే విధంగా తమ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు. దీనిపై మార్కెట్‌ నిపుణుల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం.  

ఈక్విటీ అవకాశాలు
దీర్ఘకాలంలో ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయని తెలిసిందే. 2024 సైతం ఇందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ‘‘2024 పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నాం. అంతర్జాతీయ, దేశీయ ముఖచిత్రం మెరుగ్గా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధిలో ఉండడం, మానిటరీ పాలసీ రేట్ల విషయంలో సర్దుబాట్లు, ముడి చమురు ధరలు తగ్గడం ఇందుకు మద్దతునిస్తున్నాయి’’అని ఫండ్స్‌ ఇండియా సీఈవో గిరిరాజన్‌ మురుగన్‌ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి, ఆ తర్వాత పలు దేశాల మధ్య యుద్ధాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అవరోధాల నడుమ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ప్రదర్శించడాన్ని గమనించొచ్చు. ‘‘అంతర్జాతీయంగా వాణిజ్యం విషయంలో మారిన ప్రాధాన్యతలు భారత్‌కు అనుకూలించనున్నాయి. పలు రంగాల్లో భారత్‌ అంతర్జాతీయంగా మార్కెట్‌ వాటాను పెంచుకోనుంది. ఒకవైపు సేవల ఎగుమతుల్లో బలంగా ఉన్నాం.

మరోవైపు తయారీలోనూ బలమైన స్థానం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’’అని ఓల్డ్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు కెన్నెత్‌ ఆండ్రడే పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లకు భారత్‌ ప్రాధాన్య ఎంపికగా ఉంటుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘భారత్‌ ఆర్థిక అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ వృద్ధి అంచనా 2.7 శాతాన్ని భారత్‌ వృద్ధి అంచనాలు 6.5–7 అధిగమిస్తున్నాయి. భారత ప్రభుత్వం వైపు నుంచి పారదర్శక, స్థిరమైన, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు ఈ వృద్ధికి బలాన్నిస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచవేదికపై భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్వర్గధామంగా మారుస్తున్నాయి’’అని వైజ్‌ఎక్స్‌ సీఈవో ఆర్యమన్‌ వీర్‌
తెలిపారు.  

ఈక్విటీల్లోనూ మెరుగైన రాబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అన్న సందేహం వస్తుంది. కేంద్ర సర్కారు దేశీ తయారీ బలోపేతంపై విరామం లేకుండా కృషి చేస్తోంది. కనుక తయారీ రంగం 2024లోనూ బలమైన పనితీరు చూపించనుంది. 2024 సంవత్సరం మధ్య నుంచి వడ్డీ రేట్ల కోత మొదలవుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత భారత మార్కెట్లకు మరింత బూస్ట్‌నిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి.

‘‘వడ్డీ రేట్ల కోతతో విదేశీ ఇనిస్టిట్యూషన్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా భారత్‌కు తరలివస్తాయి. దీంతో తయారీ, ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్, రియల్‌ ఎస్టేట్, డిఫెన్స్, రైల్వే ఇన్‌ఫ్రా, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కంపెనీలు లాభపడనున్నాయి’’అని మురుగన్‌ వివరించారు. దేశీయ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తుంటే.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలు, సూచీల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆండ్రడే తెలిపారు.

‘‘ఈ ఏడాది డిఫెన్స్, రియాలిటీ, ఆటో, ప్రభుత్వరంగ, ఫార్మా కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. నూతనతరం (న్యూఏజ్‌) వ్యాపార కంపెనీలు అయితే డార్క్‌హార్స్‌గా నిలుస్తాయి. ఫైనాన్షియల్స్, ఐటీ, తయారీ, ప్రభుత్వరంగ సంస్థలు, హెల్త్‌కేర్‌ థీమ్‌లు సైతం ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతాయి’’ అని రీసెర్చ్‌ అండ్‌ ర్యాంకింగ్‌ సీఐవో జ్రస్పీత్‌ సింగ్‌ అరోరా అభిప్రాయపడ్డారు. 2022 ఈక్విటీలకు అనుకూలంగా లేని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2022, 2023 రెండు సంవత్సరాలకు కలిపి చూస్తే సెన్సెక్స్‌ ఇచి్చన నికర వార్షిక రాబడి 11.5 శాతమే. మార్కెట్ల వ్యాల్యూషన్లు కొంచెం గరిష్ట స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు వైవిధ్యంతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్, లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, అధిక రుణభారంతో నడిచే కంపెనీలకు దూరంగా ఉండాలని మురుగన్‌ సూచించారు.  

రియల్‌ ఎస్టేట్‌
దశాబ్ద కాలం పాటు రియల్‌ ఎస్టేట్‌లో డిమాండ్‌ పెద్దగా పెరగలేదు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి డిమాండ్‌ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. వచ్చే ఐదు, పదేళ్ల పాటు రియల్‌ ఎస్టేట్‌ మెరుగైన పనితీరు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు, విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుకు అనుగుణంగా ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కానీ, భౌతిక రియల్‌ ఎస్టేట్‌ అన్నది భారీ పెట్టుబడికి సంబంధించిన అంశం. అధిక ఆర్జన కలిగిన వర్గానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ‘‘పెట్టుబడి పరంగా రియల్‌ ఎస్టేట్‌ అన్నది క్లిష్టమైన, లిక్విడిటీ పెద్దగా లేని సాధనం. వైవిధ్యం కోసం రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా, రిస్‌్కలు కూడా లేకపోలేదు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’’అని హర్ష గెహ్లాట్‌ సూచించారు. వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, అందుకు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్‌ అయిన రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లను పరిశీలించొచ్చు.  

బంగారం
దీర్ఘకాలంలో (10–15 ఏళ్లు అంతకంటే ఎక్కువ) బంగారం ద్రవ్యోల్బణానికి మించి రాబడులను ఇస్తున్నట్టు ఫండ్స్‌ ఇండియా రిపోర్ట్‌ చెబుతోంది. చారిత్రక గణాంకాలను పరిశీలించినా ఇదే విషయం తెలుస్తుంది. దీర్ఘకాలంలో బంగారంపై రాబడి ద్రవ్యోల్బణం కంటే 2–4 శాతం అధికంగా ఉంటోంది. స్వల్పకాలానికి ఇది అనుకూలమైన సాధనం కాదు. అదే పనిగా స్థిరమైన రాబడులను అన్ని కాలాల్లోనూ బంగారం నుంచి ఆశించరాదు.

మధ్య మధ్యలో బంగారం కొన్నేళ్లపాటు ఎలాంటి రాబడులు లేకుండా కొనసాగుతందని చెప్పడానికి గత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దీర్ఘకాలం కోసం ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యానికి తోడు, అనిశి్చత సమయాల్లో, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌ సాధనంగా ఉపకరిస్తుంది.

‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ బంగారంలో పెట్టుబడికి బలమైన నేపథ్యాలుగా చూడొచ్చు. రాబడులు అధిక స్థాయిలో లేకపోయినా, మరే ఇతర సాధనంలో లేనంతగా పెట్టుబడుల భద్రతకు బంగారం భరోసానిస్తుంది. రిస్‌్కలను ఎదుర్కొనేందుకు వీలుగా పోర్ట్‌ఫోలియోలో కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది’’అని ఫిన్‌ఎడ్జ్‌ సీఈవో హర్ష గెహ్లాట్‌ సూచించారు.  


 బంగారానికి అనుకూలించే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. డాలర్‌ నుంచి వైవిధ్యం కోరుకోవడం కూడా బంగారానికి మద్దతునిచ్చే అంశం. సెంట్రల్‌ బ్యాంక్‌ల నుంచి బంగారానికి డిమాండ్‌ ఉండడం 2023లో ధరలకు మద్దతునిచి్చందని, 2024లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. భారత్, చైనా బంగారం కొనుగోళ్లలో రెండు అతిపెద్ద దేశాలు కాగా, వీటి నుంచి ఈ ఏడాదీ కొనుగోళ్లకు డిమాండ్‌ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పైగా మన దేశం బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్న క్రమంలో బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనా కూడా ఉంది. అయితే బంగారానికి ఎంత శాతం పెట్టుబడి కేటాయించుకోవాలన్న సందేహం ఏర్పడొచ్చు. ‘‘పెట్టుబడులకు బంగారాన్ని వైవిధ్య సాధనంగా చూడొచ్చు. అదే సమయంలో బంగారంపై పరిమితికి మించి చేసే పెట్టుబడులతో ప్రతికూల ఉత్పాదకత కూడా ఎదురుకావచ్చు. కనుక ఇన్వెస్టర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతానికి మించకుండా బంగారానికి కేటాయించుకోవచ్చు’’అని నిపుణుల సూచన.  

వేటికి ఏ మేరకు..  
వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఒక్కో సాధనానికి ఎంత మేరకు కేటాయింపులు చేయాలన్నదీ కీలకమే. ఇన్వెస్టర్‌ వయసు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల కాల వ్యవధి, పెట్టుబడుల వెనుక ఉన్న లక్ష్యం ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ నియమం ప్రకారం.. ఐదేళ్లు అంతకుమించి ఎక్కువ కాలం పాటు తన పెట్టుబడులు కొనసాగించే వెసులుబాటు ఉండి, అధికంగా వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్స్‌ మొదటి ఆప్షన్‌ అవుతుంది.

ఫండ్స్‌ బలమైన నియంత్రణల మధ్య, తక్కువ వ్యయాలు, చక్కని వైవిధ్యంతో, తగినంత లిక్విడిటీతో, నిపుణుల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయని, ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని గెహ్లాట్‌ సూచించారు. రిస్క్‌ నివారణకు ఈక్విటీల్లో దీర్ఘకాలానికి సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఐదేళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేసే వారు ఈక్విటీలకు మొత్తం పెట్టుబడుల్లో 70–80% వరకు, డెట్‌కు 15–20% వరకు, బంగారానికి 5–10% మధ్య కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ పదేళ్లు అంతకుమించి అయితే ఈక్విటీలకు 80–90%, డెట్‌కు 5–10%, బంగారానికి 5–10% వరకు కేటాయించుకోవచ్చు. పదేళ్లకు రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని అనుకుంటే 20% వరకు కేటాయింపులు చేసుకోవచ్చన్నది సూచన. అప్పుడు డెట్‌ కేటాయింపులను రియల్‌ ఎస్టేట్‌కు మళ్లించుకోవచ్చు.

డెట్‌ సాధనాలు..
డెట్‌ (స్థిరాదాయ) విభాగంలో పెట్టుబడులకు ఈ ఏడాది అనుకూలమేనని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘2023–24 వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ అర శాతం పెంచి 7 శాతం చేసింది. 2024లో కనీసం మూడు పర్యాయాలు రేట్ల కోత ఉంటుందని యూఎస్‌ ఫెడ్‌ సంకేతాలు ఇచి్చంది. వడ్డీ రేట్ల కోతతో బాండ్‌ ధరలు పెరుగుతాయి. ఇది బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి అనుకూలం’’అని రీసెర్చ్‌ అండ్‌ ర్యాంకింగ్‌ సీఐవో జ్రస్పీత్‌ సింగ్‌ అరోరా పేర్కొన్నారు.

‘‘2024–25లో జీడీపీ 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తుంది. అదే కాలంలో సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చు. గడిచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం 6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కనుక 2024–25 ద్వితీయ ఆరు నెలల్లో ఆర్‌బీఐ రేట్ల కోత చేపట్టొచ్చు. ఆ నిర్ణయం పదేళ్ల భారత ప్రభుత్వ బాండ్ల (ఐజీబీ)కు అనుకూలిస్తుంది. భారత ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లలో ఉన్న వారు రేట్ల కోత ప్రయోజనాలు పొందుతారు’’అని ఎడెల్‌వీజ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సీఐవో దావల్‌ దలాల్‌ తెలిపారు. 10 ఏళ్ల ఐజీబీ ప్రస్తుతమున్న 7.17 స్థాయి నుంచి 2025 మార్చి నాటికి 6.75 శాతానికి దిగొస్తుందని దలాల్‌ అంచనా వేస్తున్నారు.

ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రమంగా వ్యవధి పెంచుకోవాలని, ఐజీబీలను జోడించుకోవాలని సూచించారు. స్వల్ప కాలానికి కార్పొరేట్‌ సంస్థలు షార్ట్‌డ్యురేషన్‌ బాండ్ల జారీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిపై ఈల్డ్స్‌ పెరగొచ్చని.. ఇన్వెస్టర్లు దీర్ఘకాల బాండ్లలో ప్రస్తుతమున్న అధిక రేట్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారని దలాల్‌ అంచనా వేశారు. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల డెట్‌ సాధనాలపై ఇప్పుడు కాల వ్యవధితో సంబంధం లేకుండా ఒకటే పన్ను విధానం ఉండడాన్ని మర్చిపోకూడదు.

డెట్‌ సాధనాలపై వచ్చే ఆదాయం వ్యక్తుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారి ఆదాయ శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మెరుగైన రాబడులు ఇచ్చే డెట్‌ సాధనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. మీడియం డ్యురేషన్‌తో కూడిన డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇందులో ఒకటి. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నందున ఈ సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. ఎఫ్‌డీలు, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ సహజంగా తక్కువ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement