
ఢిల్లీ : ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్ తాజాగా మరిన్ని పెట్టుబడులు సమీకరించింది. టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్, సిల్వర్ లేక్‌తో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లయిన టైగర్ గ్లోబల్, జనరల్ అట్లాంటిక్, ఔల్ వెంచర్స్ మొదలైన సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ పెట్టుబడుల పరిమాణం సుమారు 500 మిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ.3,672 కోట్లు) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనితో బైజూస్ వేల్యుయేషన్‌ను 10.8 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లవుతుంది.
కరోనా వైరస్‌పరమైన సంక్షోభ సమయంలో ఎడ్–టెక్ రంగం సానుకూలంగా రాణించగలిగిందని బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ తెలిపారు. బైజూస్‌తో జట్టు కట్టడంపై సిల్వర్ లేక్ సహ–సీఈవో గ్రెగ్ మాండర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బైజూస్ యాప్‌లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6.2 కోట్లుగా ఉండగా, 42 లక్షల పైచిలుకు వార్షిక చందాదారులు ఉన్నారు. 2018–19తో పోలిస్తే 2019–20లో ఆదాయం రూ. 1,430 కోట్ల నుంచి రూ. 2,800 కోట్లకు చేరింది. బైజూస్ ఇటీవల డీఎస్‌టీ గ్లోబల్, బాండ్, జనరల్ అట్లాంటిక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పెట్టుబడులు సమీకరించింది. (మూడేళ్లూ జీతం నిల్!)