
హైదరాబాద్: ట్రెసా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’ మోడల్‌ను ఆవిష్కరించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్ ఫామ్: ఫ్లక్స్350పై దీన్ని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్ కోసం డిజైన్ చేసినట్టు తెలిపింది. భవిష్యత్ కోసం ఉద్దేశించిన సుస్థిర రవాణా పరిష్కారాలను అందించాలన్న సంస్థ అంకిత భావానికి ఈ ఉత్పత్తి నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’లో 350 కిలోవాట్ పవర్‌ను అందించే మోటార్ ఉంటుంది. ఈ తరహా పవర్‌ను అందించే తొలి భారత ఓఈఎం తమదేనని ట్రెసా మోటార్స్ ప్రకటించింది.
యాక్సియల్ ఫ్లక్స్ మోటార్‌ను పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘‘దేశంలో 28 లక్షల ట్రక్కులు ఉన్నాయి. ఇవి 60 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. కనుక మధ్య స్థాయి నుంచి, భారీ తరహా ట్రక్కులు సున్నా ఉద్గార ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. 2024లో రానున్న వాహన తుక్కు విధానం, పెరుగుతున్న ఇంధన ధరలు ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుకూలించనున్నాయి. సురక్షిత, వినూత్న, పర్యావరణ పరిష్కారాలతో ఈ పరివర్తనాన్ని ట్రెసా ముందుండి నడిపిస్తుంది’’అని సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment