What Is Treasury Bills Or T-bills And How Do They Work, Explained In Telugu - Sakshi
Sakshi News home page

What Is Treasury Bills: బ్యాంక్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ రాబడి!

Published Mon, Sep 12 2022 5:42 PM | Last Updated on Mon, Sep 12 2022 6:21 PM

What Is Treasury Bills Or T-bills And How Do They Work - Sakshi

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నాయి. అమెరికా, యూరోప్‌లో మాంద్యం వస్తుందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు (మ్యూచువల్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్‌) తమ పెట్టుబడులను రిస్క్‌ ఎక్కువగా ఉండే ఈక్విటీల నుంచి సురక్షిత సాధనాలైన అమెరికా ట్రెజరీ బిల్లులకు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు అమెరికా ట్రెజరీలు ఎలానో.. భారత ఇన్వెస్టర్లకు ట్రెజరీ బిల్లులు (టీ బిల్లులు) కూడా అలాంటివే. పైగా బ్యాంకు డిపాజిట్ల కంటే ఇవి మరింత సురక్షితమైనవి. కాస్తంత అధిక రాబడినిచ్చేవి కూడా. అయితే, వీటిలో ఇన్వెస్ట్‌ చేయడానికి గల మార్గాలు.. వీటివల్ల ప్రయోజనాలు వంటి అంశాలన్నింటనీ వివరించేదే ఈ కథనం.

టీ బిల్లులు అంటే..?
ప్రభుత్వ వ్యయాలు, ఆదాయానికి మధ్య అంతరాన్ని ద్రవ్యలోటు (ఫిస్కల్‌ డెఫిసిట్‌)గా పేర్కొంటారు. ఈ అంతరాన్ని పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ నుంచి రుణాల రూపంలో నిధులను సమీకరిస్తుంటుంది. ఇలా సమీకరించే నిధులకు హామీగా బాండ్లను జారీ చేస్తుంది. వీటినే టీ బిల్లులు/జీసెక్‌లు అంటారు. ఇవి 91 రోజుల కాలవ్యవధి నుంచి, దీర్ఘకాలానికి అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ రుణ సమీకరణ వ్యవహారాలను ఆర్‌బీఐ చూస్తుంటుంది. ఏడాది వ్యాప్తంగా టీ బిల్లులకు వేలాన్ని నిర్వహిస్తుంటుంది. దీర్ఘకాలానికి బాండ్లను జారీ చేస్తే అవి డేటెడ్‌ జీసెక్‌లు అవుతాయి. అంటే ప్రభుత్వ సెక్యూరిటీలు. అవే బాండ్లు ఏడాది వరకు కాలవ్యవధిపై జారీ చేస్తే వాటిని టీ బిల్లులు లేదా వై బిల్లులుగా వ్యవహరిస్తారు. గతంలో అయితే కేవలం బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌ మాత్రమే ఆర్‌బీఐ నిర్వహించే వేలంలో టీ బిల్లులు, జీసెక్‌లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది. కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం ఆర్‌బీఐ వేలంలో పాల్గొని టీ బిల్లులను కొనుగోలు చేసే అవకాశాన్ని గతేడాది కేంద్ర ప్రభుత్వం కల్పించింది. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి టీ బిల్లులు మంచి ప్రత్యామ్నాయం అవుతాయి. భారత ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు, 364 రోజులు.. ఇలా మూడు రకాల కాల వ్యవధితో టీ బిల్లులను జారీ చేస్తోంది. వీటిపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్ల మాదిరి వడ్డీని ప్రత్యేకంగా చెల్లించడం టీ బిల్లుల్లో ఉండదు. దీనికి బదులు ఆఫర్‌ చేస్తున్న వడ్డీ రేటు ప్రకారం నిర్ణీత కాల వ్యవధికి ఎంత వస్తుందో ముందుగానే లెక్కించి, ఆ మేరకు టీ బిల్లు ముఖ విలువ (ఫేస్‌ వ్యాల్యూ)లో డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తారు. దాంతో ఫేస్‌ వ్యాల్యూపై ఇస్తున్న తగ్గింపే రాబడిగా పరిగణించాలి. ఉదాహరణకు 91 రోజుల టీ బిల్లు ముఖ విలువ రూ.100 అనుకుంటే.. దాన్ని రూ.98.5కు జారీ చేస్తారు. ఇక్కడ 91 రోజులకు వచ్చే రాబడి 6.1 శాతం అవుతుంది. 

మధ్యలో నగదు కష్టమే! 
టీ బిల్లులు, జీసెక్‌లు ఎన్‌డీఎస్‌ ఓఎం ప్లాట్‌ఫామ్‌లో రోజువారీగా ట్రేడ్‌ అవుతుంటాయి. అయితే, రిటైల్‌ ఇన్వెస్టర్లకు సంబంధించి చిన్న లాట్లకు లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. కనుక కాలవ్యవధి ముగిసేలోపు అవసరం ఏర్పడితే, టీ బిల్లులను నగదుగా మార్చుకోవడం కష్టం అవుతుంది. బ్యాంక్‌ డిపాజిట్లకు ఈ ప్రతికూలత లేదు. కోరుకున్న రోజు వెళ్లి డిపాజిట్‌ రద్దు చేసుకోవచ్చు. ఇలా రద్దు చేసుకుంటే, అప్పటి వరకు హోల్డ్‌ చేసిన కాల వ్యవధికి అనుగుణమైన వడ్డీ రేటే లభిస్తుందన్నది మర్చిపోవద్దు. 91 రోజుల నుంచి 364 రోజులు స్వల్పకాలమే కనుక.. గడువు ముగిసేవరకు టీ బిల్లులను కొనసాగించడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇందుకు ముందే సన్నద్ధం కావాలి. మీ నిధుల అవసరాలకు తగిన కాలవ్యవధిని ఎంపిక చేసుకుంటే ఈ సమస్య ఉండదు.

కొనుగోలు మార్గం ఇలా... 
టీ బిల్లుల వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవాలని అనుకుంటే.. రిటైల్‌ ఇన్వెస్టర్లు ‘రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ (ఆర్‌డీజీ) అకౌంట్‌’ను ఆర్‌బీఐ వద్ద తెరవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్‌డీజీ ఖాను బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ చేసుకోవాలి. కొనుగోలు విలువకు సరిపడా మొత్తాన్ని ముందుగానే బ్యాంక్‌ ఖాతా నుంచి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌బీఐ వేలాన్ని రద్ధు చేస్తే తప్ప.. రిటైల్‌ ఇన్వెస్టర్లకు టీ బిల్లుల జారీ  నిలిచిపోవడం ఉండదు. ఒక్కసారి ఆర్‌డీజీ ఖాతాను తెరిచారంటే.. ఆ తర్వాత రానున్న వేలం వివరాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌ రూపంలో మెయిల్‌కు వస్తుంటాయి. ఆర్‌బీఐ ఆర్‌డీజీ సపోర్ట్‌ టీమ్‌ వీటిని పంపిస్తుంటుంది. సాధారణంగా టీ బిల్లుల వేలం శుక్రవారం మొదలవుతుంది. తదుపరి బుధవారం ముగుస్తుంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్‌ బిడ్‌ దాఖలు చేసే సమయంలోనే టీ బిల్లు కాలవ్యవధి, ముగింపు తేదీ (మెచ్యూరిటీ), ఇష్యూ సైజు, బిడ్‌ మొదలయ్యే, ముగిసే తేదీ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్‌బీఐ ముందే సూచనీయంగా ఈల్డ్‌ (రాబడి) ఎంతన్నది తెలియజేస్తుంది. అయితే, ఇన్‌స్టిట్యూషన్స్‌ వేసే బిడ్డింగ్‌ ఆధారంగా వేలంలో జీ సెక్‌లు, టీ బిల్లుల ఈల్డ్‌ కొంత మార్పునకు గురికావచ్చు. తుది కటాఫ్‌ ఈల్డ్‌ ఆధారంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు టీ బిల్లులు కేటాయిస్తారు. దీనికి అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని ఇన్వెస్టర్‌ బ్యాంకు ఖాతాకు తిరిగి జమ చేస్తారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు టీ బిల్లుల్లో కనీసం రూ.10,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి రూ.10,000 చొప్పున రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంది. ప్రతి వేలంలో ఒక ఇన్వెస్టర్‌ నుంచి ఒక బిడ్‌ దాఖలుకే అనుమతి ఉంటుంది.

రాబడి.. 
బ్యాంక్‌ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరిగా కాకుండా.. టీ బిల్లులుపై ఈల్డ్స్‌ అన్నవి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎంతో సున్నితంగా ఉంటాయి. వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఈల్డ్స్‌ వేగంగా పెరుగుతాయి. తగ్గే క్రమంలోనూ అదే విధంగా తగ్గుతుంటాయి. ఆర్‌బీఐ వ్యవస్థ నుంచి నిధులను వెనక్కి తీసుకుంటూ, వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంలో ఇటీవలే టీ బిల్లుల రేట్లు పెరిగాయి. 2022 ఆగస్ట్‌ 5 నాటి ఎంపీసీ సమావేశంలో రేట్ల పెంపు తర్వాత.. 364 రోజుల టీ బిల్లు ఈల్డ్స్‌ రేటు 6.23 శాతం, 182 రోజుల టీ బిల్లు ఈల్డ్స్‌ 5.89%, 91 రోజుల టీ బిల్లు ఈల్డ్స్‌ 5.56 శాతంగా ఉన్నాయి. కానీ, ఏడాది క్రితం ఇవే ఈల్డ్స్‌ వరుసగా 3.39%, 3.53%, 3.73 శాతంగా ఉండడాన్ని గమనించాలి. ప్రస్తుతం ఎస్‌బీఐ టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను పరిశీలించినట్టయితే.. 46 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధికి 3.90%, 180–210 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 4.55%, 211 రోజుల నుంచి ఏడాది కాల వ్యవధి డిపాజిట్లపై 4.60% చొప్పున ఉన్నాయి. ఈ రేట్లతో పోల్చినా, ప్రముఖ ప్రైవేటు బ్యాంకు డిపాజిట్‌ రేట్లతో పోల్చి చూసినా.. టీ బిల్లు ఈల్డ్స్‌ మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఇందులో చేసే పెట్టుబడి మొత్తానికి 100% సార్వభౌమ హామీ ఉంటుంది. పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్లలోనూ రేటు 5.5 శాతమే ఉంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టీ బిల్లుల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం అనుకూలమే అవుతుంది.

ప్రయోజనం.. 
అధిక భద్రతతో కూడిన టీ బిల్లులను రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. బ్యాంక్‌ ఎఫ్‌డీ లేదా పోస్టాపీసు పథకానికి ఇది కచ్చితంగా ప్రత్యామ్నాయం అవుతుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. మూడు నెలల నుంచి ఏడాది వరకు ఆగితే పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది. వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవడం అనుకూలం కాదు. ఈ తరుణంలో స్వల్పకాల పెట్టుబడులే ఎక్కువ ఫలితమిస్తాయి. బోనస్‌ రూపంలో, ప్రాపర్టీ విక్రయం రూపంలో నిధులు సమకూరితే, ముందుగా వాటిని టీ బిల్లుల్లో ఇన్వెస్ట్‌ చేసుకుని.. దీర్ఘకాలం కోసం అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకున్న తర్వాత అందులోకి మళ్లించుకోవచ్చు. అలాగే, ఈక్విటీ పెట్టుబడులను ఇతర సాధనాల్లోకి మళ్లించేట్టు అయితే, అలాగే, ఇతర సాధనాల నుంచి ఈక్విటీల్లోకి మళ్లించేందుకు టీ బిల్లులను తాత్కాలిక వేదికలుగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్ల వాల్యేషన్లు అధికంగా ఉంటే ఒకేసారి పెట్టుబడి అనుకూలం కాదు. కనుక ఈ మొత్తాన్ని టీ బిల్లుల్లో 91 రోజులు, 182 రోజులు, 364 రోజులకు మూడు భాగాలుగా ఇన్వెస్ట్‌ చేసి.. వెనక్కి వచ్చిన ప్రతి విడత మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అయి తే, అధిక పన్ను బ్రాకెట్‌లో ఉన్న వారికి టీ బిల్లులు అనుకూలం కాదు. ఎందుకంటే టీ బిల్లులపై రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కనుక దీనిపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement