ఎస్‌బీఐ ఏటీఎంలలో రూ.10వేలు, అంతకు మించి చేసే డెబిట్ కార్డు నగదు ఉపసంహరణలకు ఓటీపీ నమోదు చేయడం అన్నది ఇకపై 24 గంటల పాటు అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు కస్టమర్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) రూ.10వేలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ ప్రకటించింది.
ఎస్‌బీఐ కార్డుదారులకు ఉచితంగా క్రెడిట్ స్కోరు!
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం కల్పించనున్నామని సంస్థ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ‘‘అమెరికాలో మాదిరిగా రెండు మూడు అంశాలను ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. క్రెడిట్‌కార్డు దారులకు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం ఇందులో ఒకటి. అకౌంట్‌లో లాగిన్ అయినప్పుడు తమ క్రెడిట్ స్కోరు ఎంతో ఎటువంటి ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు.
అమెరికాలో ఇది సర్వ సాధారణం. దీని ద్వారా అన్ని సమయాల్లోనూ తమ క్రెడిట్ స్కోరు ఏ విధంగా మార్పులు చెందుతుందో తెలుసుకోవచ్చు. కస్టమర్ అనుకూలమైన ఈ చర్యను వెంటనే అమలు చేయాల్సి ఉంది. దీనిపై మా బృందంతో చర్చించాను’’ అని వివరించారు. ‘‘ రిటైలర్ స్థాయిలో ఈ విధమైన స్కీమ్‌పై పని చేయాలనకుంటున్నాము. ఇప్పటికే ఎస్‌బీఐ కార్డ్ కో బ్రాండెడ్ విభాగంలో 14 ఒప్పందాలను కలిగి ఉంది. మరింత పెంచాలనుకుంటున్నాము. కస్టమర్ల సేవల విస్తృతిపై దృష్టి సారించాము’’ అని తివారీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment