![World Wide Web Day August 1 2024 facts](/styles/webp/s3/article_images/2024/07/31/www.jpg.webp?itok=1UMljhS3)
ముప్ఫై ఐదేళ్ల క్రితం కనుక్కొన్న మూడు అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఆ మూడు అక్షరాలు లేకుంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంటర్నెట్ లేదు. ఆ మూడు అక్షరాలు www. అదే వరల్డ్ వైడ్ వెబ్. నేడు (ఆగస్ట్ 1) ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..
ఇదీ www చరిత్ర
ఇంటర్నెట్ అనేది కంప్యూటర్లను కలిపే నెట్‌వర్క్ అయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ వెబ్ పేజీలను కలిపే వ్యవస్థ. ఇది నేడు ప్రపంచాన్ని శాసించే వేలాది ఇతర ఆవిష్కరణల సృష్టికి దారితీసింది. అయితే, వరల్డ్ వైడ్ వెబ్ జనాల దృష్టికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1989లో టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన దీన్ని WWW అనే దాన్ని రూపొందించారు.
బెల్జియన్ ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ కైలియాయు మరింత మెరుగుపరిచారు. వారిద్దరూ కలిసి హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (HTTP)ని అభివృద్ధి చేశారు. దాన్ని 1992లో ఆవిష్కరించారు. అనేక ఇతర గొప్ప సాంకేతికతల మాదిరిగానే WWW అనేది మొదట్లో సాధారణ ప్రజల కోసం రూపొందించింది కాదు. భౌతిక శాస్త్రవేత్తలు సమాచారాన్ని పంచుకోవడం కోసం దీన్ని రూపొందించారు. తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఇందులో మొదటి ఫోటో 1992లో బెర్నర్స్-లీ అప్‌లోడ్ చేశారు. 1990ల మధ్య నాటికి మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కూడగట్టుకోవడం ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ మాధ్యమంగా నిరూపించుకుంది. 21వ శతాబ్దం నాటికి, వెబ్ వినియోగం కంప్యూటర్‌లతోపాటు స్మార్ట్‌ఫోన్‌లకు కూడా మారింది. నేడు, వరల్డ్ వైడ్ వెబ్‌ను గేమింగ్ పరికరాలు, సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌ల ద్వారా కూడా యాక్సెస్ చేస్తున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వరల్డ్ వైడ్ వెబ్ యాక్టివ్ యూజర్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment