
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.41 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 11 నెలలుగా ఇంత తక్కువ స్థాయి టోకు ధరల రేటు నమోదు ఇదే తొలిసారి. గడచిన మూడు నెలలుగా టోకు ధరల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. అయితే ఈ సూచీ రెండంకెలపైనే కొనసాగడం ఇది వరుసగా 17వ నెల. దీనితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలల నుంచి కేంద్రం నిర్ధేశిస్తున్న 6 శాతం ఎగువన కొనసాగుతోంది. ఆయా అంశాలు సామాన్యునిపై ధరల భారాన్ని మోపుతున్నాయి.
గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే..
♦ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 12.37 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 10.77 శాతమే. తృణధాన్యాలు (1.77శాతం), గోధుమలు (17.35 శాతం) పండ్లు (31.75 శాతం), కూరగాయల (22.92 శాతం) ధరలు పెరుగుదల బాటన ఉన్నాయి.
♦ టమాటా విషయంలో ధర 43.56 శాతం ఎగసింది.
♦ ఇంధనం, విద్యుత్ బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం 33.67 శాతంగా ఉంది. అయితే జూలైలో ఈ స్పీడ్ 43.75 శాతం.
♦ తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.51% ఉంది.
♦ ఆయిల్‌సీడ్స్ విషయంలో రేటు 13.48% తగ్గింది.