టీవీ రిమోట్..గోడగడియారం..పిల్లల ఆటబొమ్మలు..వంటి బ్యాటరీ ఉన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత పనిచేయకపోవడం గమనిస్తుంటాం. వాటిలో ఏదైనా సాంకేతిక సమస్యా..? లేదా బ్యాటరీ పాడైందా..అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సాంకేతిక సమస్య తలెత్తితే రిపేర్ సెంటర్‌కు తీసుకెళ్తాం. కానీ బ్యాటరీ సమస్య వల్ల పనిచేయకపోతే ఎలా నిర్ధారించుకోవాలనే అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్యాటరీని పరీక్షించండిలా..
కొత్త బ్యాటరీని సుమారు 20 సెంటీమీటర్ల(8 ఇంచులు) ఎత్తు నుంచి గట్టి ఉపరితలంపై నిటారుగా జారవిడిచినపుడు అది బౌన్స్ అవ్వదు. ఉపరితలాన్ని తాకినచోటే కిందపడడం గమనిస్తాం. కొత్త ఆల్కలీన్ బ్యాటరీల్లో రసాయన శక్తిని విద్యుత్‌శక్తిగా మార్చే జెల్ వంటి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అది పైనుంచి విసిరిన బలాన్ని నిరోదిస్తుంది. దాంతో బౌన్స్ అవ్వదు. అదే అప్పటికే వాడిన బ్యాటరీలో ఆ జెల్ పదార్థం అంతా అయిపోతుంది. కాబట్టి ఆ జెల్ ఉన్న ప్రాంతమంతా గట్టిగా మారుతుంది. దాంతో పాత బ్యాటరీను పైనుంచి విసిరినపుడు కొంత బౌన్స్ అవుతుంది. అలాజరిగితే అందులో సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు. ఈ సాధారణ పరీక్షతో పనిచేయని ఎలక్ట్రానిక్ పరికరంలో బ్యాటరీను మారిస్తే సరిపోతుంది.
ఇదీ చదవండి: వినియోగంలోకి రానున్న క్వాంటమ్ కంప్యూటింగ్
ఎక్కువకాలం రావాలంటే..
చిన్నపిల్లల ఆటవస్తువులు వంటి పరికరాలు ఉపయోగించనపుడు వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి. స్టాండ్‌బై మోడ్‌లో కూడా కొన్ని పరికరాలకు ఎనర్జీ అవసరమవుతుంది. దాంతో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి వాడిన తర్వాత వెంటనే స్విచ్‌ఆఫ్ చేయాలి.
పరికరాలను ఎక్కువకాలం ఉపయోగించకుంటే అందులోనుంచి బ్యాటరీలను పూర్తిగా తొలగించాలి. అందువల్ల ఎనర్జీ నష్టాన్ని నివారించవచ్చు.
అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో బ్యాటరీలను నిల్వ చేయరాదు. ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసం వల్ల బ్యాటరీ రసాయన ప్రక్రియలో తేడాలేర్పడుతాయి. వాతావరణంలోని భారీ ఉష్ణోగ్రతల వల్ల జెల్ సామర్థ్యం దెబ్బతింటుంది.
పాత బ్యాటరీలను, కొత్తవాటిని కలిపి ఒకేచోట నిల్వచేయకూడదు. ఏదైనా పరికరంలో రెండు బ్యాటరీలు వేయాల్సివస్తే పాత బ్యాటరీ, కొత్త బ్యాటరీను కలిపి వాడకూడదు. దాంతో పాత దానివల్ల కొత్తది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలనుబట్టి కూడా సామర్థ్యాల్లో తేడాలుంటాయి. వోల్టేజ్‌స్థాయుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించడం మేలు.
Comments
Please login to add a commentAdd a comment