‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి.. | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి..

Published Sat, Aug 5 2023 1:36 AM | Last Updated on Sat, Aug 5 2023 11:27 AM

టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన పోలీసు వాహనాలు - Sakshi

టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన పోలీసు వాహనాలు

చిత్తూరు అర్బన్‌: పుంగనూరులో టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసకాండలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అల్లరిమూకలకు ఎదురొడ్డి రక్తం చిందించారు. జిల్లాలోని పలు స్టేషన్లలో పనిచేస్తున్న 27 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు.. ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు చిత్తూరులో మూడు రోజులుగా మాక్‌డ్రిల్‌ పేరిట పోలీసు సిబ్బందిలో ధైర్యం నింపారు. అలాగే దిశ డీఎస్పీ బాబుప్రసాద్‌, క్రైమ్‌ సీఐ భాస్కర్‌కు ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురువారం పుంగనూరులో డ్యూటీలు వేశారు.

శుక్రవారం ఉదయం డీఎస్పీ బాబుప్రసాద్‌ ఎప్పటిలాగే చిత్తూరు రిజర్వు ఫారెస్టులో 5 కిలోమీటర్ల వాకింగ్‌ పూర్తి చేసుకుని ఇంట్లో భార్య, పిల్లలకు చెప్పి విధులకు బయలుదేరారు. గతంలోనూ చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పేరు బాబు ప్రసాద్‌కు ఉంది. ఇక చిత్తూరులో రూ.45 లక్షల విలువ చేసే దాదాపు 200లకు పైగా సెల్‌ఫోన్ల రికవరీలో కీలకపాత్ర పోషించిన క్రైమ్‌ సీఐ భాస్కర్‌.. గురువారం చిత్తూరులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం పుంగనూరులో బందోబస్తు విధులకు ఈయన సైతం హాజరయ్యారు.

తీవ్ర గాయాలు
చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన విధ్వంస కాండలో డీఎస్పీ బాబుప్రసాద్‌కు నుదుటి భాగంలో రెండుచోట్ల రక్తగాయాలవడంతో 20 కుట్లు పడ్డాయి. ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరరావు ఎడమచేతికి గాయమైంది. సీఐ భాస్కర్‌ తలకు, ఎడమకాలుకు రక్తగాయాలయ్యాయి. కుప్పం సీఐ శ్రీధర్‌ ఎడమ తొడకు గాయమైంది. ఎస్‌ఐ ప్రసాద్‌కు తల, చెవి, కాలర్‌బోన్‌కు గాయలయ్యాయి. చిత్తూరు దిశ స్టేషన్‌ ఎస్‌ఐ కరీమున్నీసా కుడికాలుకు గాయమైంది.

ఏఆర్‌ ఎస్‌ఐ జగన్నాథరెడ్డి, సీసీఎస్‌ ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌, గుడుపల్లె ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌, ఏఆర్‌ హెచ్‌సీ మధు, చిత్తూరు పీసీఆర్‌ ఎస్‌ఐ మధుసూదన్‌, ఏఆర్‌ ఆర్‌ఐ నీలకంఠేశ్వరరెడ్డి గాయాలయ్యాయి. తల పగిలింది. కానిస్టేబుళ్లు శంకర్‌, రణధీర్‌, అభినందరె, సుధీర్‌కుమార్‌, దినకర్‌, లోకేష్‌, మునస్వామి, రమేష్‌, హరీష్‌, గణేష్‌, జయశంకర్‌, రవిబాబునాయక్‌, శ్రీనివాసులు, వెంకటేష్‌ తీవ్రంగా గాయపడ్డారు.

కుటుంబీకుల ఆందోళన
పచ్చమూకల దాడిలో గాయపడిన పోలీసుల కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజా రక్షణే పరమావధిగా సేవలందిస్తున్న పోలీసులపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement