చిత్తూరు, తిరుపతిలో ‘ఆరణి’ మంటలు
సూళ్లూరుపేటలో వేనాటి తిరుగుబావుటా
జీడీ నెల్లూరులో శ్రేణులకు అవమానాలు
నగరి, సత్యవేడు నేతల్లో గందరగోళం
వెంకటగిరిలో బాబు దాగుడుమూతలు
టీడీపీ నేతల్లో అసహనం తారస్థాయికి చేరింది.. అధినేత తీరుతో నైరాశ్యం అలుముకుంది.. జనసేనతో జోడీ కట్టినప్పుడే కలవరం మొదలైంది.. మళ్లీ కమలదళంతో జట్టు కుదరడం అసమ్మతికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొంది.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పొత్తు చిచ్చురేపుతోంది.. నోటిఫికేషన్ ముందే తమ్ముళ్లను ఓటమి భయం వెంటాడుతోంది.. తాజా పరిణామాలను గమనిస్తున్న ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.. ఇదే పరిస్థితి జనసైనికుల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. అరువు నేతలను తీసుకురావడంపై నిరసన వెల్లువెత్తుతోంది.
సాక్షి, తిరుపతి: టీడీపీ, జనసేన అధినేత తీరుతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ శ్రేణులకు నోటిఫికేషన్‌కు ముందే ఓటమి భయం పట్టుకుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థిగా నెలవల విజయశ్రీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన వేనాటి రామచంద్రారెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి కినుక వహించారు. వేనాటి రామచంద్రారెడ్డి ఒక్క అడుగు ముందుకేసి వైఎస్సార్‌పీలో చేరేందుకు నిర్ణయించారు.
సూళ్లూరుపేట రాజకీయాల్లోకి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొండేపాటి గంగాప్రసాద్ వచ్చాక వేనాటివారి ప్రాభవం తగ్గించారనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితుల్లో వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు సుమంత్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ పర్యాయం తనొక్కడే కాకుండా కుటుంబసభ్యులు, అనుచరులను కూడా పార్టీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా తన కార్యాలయం ముందు, సూళ్లూరుపేట పట్టణం అంతా సిద్ధం బ్యానర్లును ఏర్పాటు చేసి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
తమ్ముళ్లకు అవమానాలు
గంగాధరనెల్లూరు, నగరిలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు అవమానాలు తప్పడం లేదు. ఎన్నికల ప్రచారం కోసం తనతో తిరిగేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో టీడీపీ అభ్యర్థులు తమిళనాడు నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. వారికి రోజూ రూ.750 చెల్లిస్తున్నారు. ఈ పంపిణీ బాధ్యతలను స్థానిక టీడీపీ శ్రేణులను నమ్మని అభ్యర్థులు.. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా నియమించుకున్న వారికి బాధ్యతలు అప్పగించారు. దీనిపై తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమనను నమ్మనప్పుడు ఎన్నికల్లో పనిచేయలేమని చేతులెత్తేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్, ఆ పార్టీ నాయకులు పచ్చపత్రికల విలేకరులను పిలిపించుకుని భారీ ఎత్తున డిన్నర్ ఏర్పాటు చేసి, వారి చేతిలో కొంత నగదు పెట్టి ఎన్నికల్లో సాయం చేయమని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సత్యవేడు నియోజకవర్గ టీడీపీ నేతలకు ఎమ్మెల్యే ఆదిమూలం తలనొప్పులు ఎక్కువయ్యాయి.
వెంకటగిరిలో సర్వే నాటకాలు
వెంకటగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు సర్వేల పేరిట దాగుడు మూతలాడుతున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేరుతో సర్వే చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె, మస్తాన్‌యాదవ్ పేర్లతో సర్వే చేయిస్తున్నారు. దీంతో స్థానిక టీడీపీలో గందరగోళం నెలకొంది.
తిరుపతి, చిత్తూరులో అసమ్మతిరాగం
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీలోకి రాక ముందు.. కొన్నాళ్లు టీడీపీలో, ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. చంద్రబాబు సీటు ఇవ్వకపోవడంతో ఆరణి శ్రీనివాసులు టీడీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌పీలో చేరి తొలుత ఓడిపోయారు. మళ్లీ 2019లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఈ ఐదేళ్ల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈ సారి వైఎస్సార్‌సీపీ ఆయనను పక్కనపెట్టింది. దీంతో ఆరణి శ్రీనివాసులు టీడీపీలో చేరేందుకు విఫల యత్నం చేశారు. చివరకు కాపు కార్డుతో జనసేనలో చేరాడు. తిరుపతి టికెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాన్ని చిత్తూరు, తిరుపతికి చెందిన జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంపై టీడీపీలోని ఆశావాహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బైబై బాబు!
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై కొందరు నాయకులు రగిలిపోతున్నారు. రెండుమూడు రోజుల్లో సీట్ల కేటాయింపు ఖరారు కానుండడంతో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీ నుంచి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి అసెంబ్లీ ఇప్పటికే జనసేనకు కేటాయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో తిరుపతి పార్లమెంట్ టికెట్ కూడా టీడీపీకి దక్కే పరిస్థితి లేదని తేలిపోయింది. దీనిపై తిరుపతి టీడీపీ నేతలు శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకించాలని నిర్ణయించారు. తిరుపతి ఎంపీ లేదా? అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి టీడీపీ అభ్యర్థి ఎవరో ఒకరు పోటీ చేయాలి? ఆరణి శ్రీనివాసులుకు కాకుండా తిరుపతికి చెందిన నేతనే జనసేన అభ్యర్థిగా పోటీకి దింపాలి.. అని తీర్మానాలు చేసినట్లు సమాచారం.
శ్రీకాళహస్తిలో బొజ్జల ఆందోళన
ప్రస్తుతం శ్రీకాళహస్తి అసెంబ్లీ కూడా టీడీపీ వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బొజ్జల సుధీర్‌రెడ్డి, ఎస్సీవీ నాయుడు ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లినట్లేనని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.‘పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ గుర్తు లేకుండా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటి పార్టీకి ఈ ఎన్నికల్లో గుర్తే లేకుండా చేస్తారా..?. ఇవేం పొత్తులు..? ఇలా అయితేమేం చేయలేం’ అంటూ టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. ఒక వేళ కాదు కూడదు అంటే మేం దూరమవుతామని కరాఖండీగా చెప్పేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment