కుప్పంలో చంద్రబాబు తీరు
నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ ఓటర్లే
ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజికవర్గం
అడుగడుగునా అవమానాలపై రగిలిపోతున్న కుప్పం బీసీలు
కుప్పంలో బీసీలను చంద్రబాబునాయుడు దగా చేస్తున్నారు. అత్యధికంగా బీసీలు ఉన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. ఒకటి కాదు..రెండుకాదు.. ఏకంగా 35 ఏళ్లు పాతుకుపోయారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధి పేరుతో గారడీలు చేస్తున్నారు. బీసీల డీఎన్‌లోనే టీడీపీ ఉందంటూ బోల్తా కొట్టిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని వదిలి కుప్పానికి వచ్చి బీసీలను నిలువునా ముంచేస్తున్నారు. పదవి ఒకరిది.. పెత్తనం మరొకరికి అప్పగించి వేడుక చేస్తున్నారు. దీనిపై స్థానికులు రగిలిపోతున్నారు. బీసీల ద్రోహి చంద్రబాబు అంటూ విరుచుకుపడుతున్నారు. స్థానికేతరుడైన బాబుకు ఈ సారి గుణపాఠం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సాక్షి, తిరుపతి: బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా మాయమాటలతో బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ వారిని దగా చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా కుప్పం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తూ వస్తున్నారు. 2014, 2019లో బీసీ (వన్నెకుల క్షత్రియ) సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళిని అభ్యర్థిగా నియమించారు. తాజాగా దివంగత చంద్రమౌళి కుమారుడు భరత్‌ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రి పదవి ఇచ్చి కేబినెట్‌లో తన పక్కన కూర్చోబెట్టుకుంటానని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే కంటే ముందే భరత్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గం వారివే. అయినా నియోజకవర్గంలో చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లు ఒక్క శాతం కూడా లేవు. లెక్కబెడితే పట్టుమని వెయ్యి ఓట్లు కూడా లేవని తేలింది.
పక్క రాష్ట్రాల నుంచి
ఎన్నికల కోసం అంటూ కుప్పంలో మరో రెండు వేల మందిని పక్క రాష్ట్రాల నుంచి బాబు దింపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 200 మంది కర్ణాటక వాసులు కుప్పంలో తిష్టవేశారు. వీరు గ్రామాలు, వార్డుల్లో టీడీపీ శ్రేణులు, ఓటర్లు ఎటువైపు ఉన్నారో సర్వే చేసి చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఎన్నికల్లో స్థానికులకే కాకుండా బయటి వారికే బాధ్యతలు అప్పగించటం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే 2వేల మంది కర్ణాటక, తమిళనాడు వాసులను కుప్పానికి దిగుమతి చేసుకోనున్నారు.
వీరంతా టీడీపీ శ్రేణులపై నిఘా పెట్టటడంతో పాటు, కుప్పం ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక కుప్పానికి కృష్ణా జలాలు తీసుకు రావడం, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.1,400 కోట్లు ఖర్చుచేయడంపై జరుగుతున్న చర్చ నుంచి ఓటర్ల దృష్టిని మరల్చేందుకే వీరిని రంగంలోకి దింపుతున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
పేరుకే బీసీ ఇన్‌చార్జ్
ముపై ఐదేళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నివాసం మాత్రం హైదరాబాద్‌లో. కుప్పంలో తనకు బదులు బీసీ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నంను ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే ఆయన పేరుకే ఇన్‌చార్జ్, పెత్తనమంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అప్పగించారు. ఈయన ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు కావటం గమనార్హం.
కొంతకాలంగా నియోజకవర్గంలో ఆయన పెత్తనమే నడుస్తోంది. స్థానిక టీడీపీ నాయకుల సూచనలను, సలహాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. స్థానిక నాయకులకు ప్రాధాన్యం లేకపోవటంతో టీడీపీ నాయకులు అవమానంగా భావిస్తున్నారు. చంద్రబాబును 14 ఏళ్లు సీఎంగా, ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా కనీసం తాగు, సాగు నీరు కూడా తీసుకురాలేకపోయారని నియోజకవర్గ ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా? అంటూ బీసీ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment