తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్ధుల వర్షం కురిపించారు. కుర్చీలు మడతబెట్టి తన్నుకున్నారు. చేతికొచ్చిన వస్తువుతో చెలరేగిపోయారు. కర్రలతో చావబాదుకున్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోలు ఫ్లెక్సీలు, బ్యానర్లలో లేవని జనసైనికులు.. తాము చెప్పినట్టు వినడం లేదని టీడీపీ వలంటీర్లు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఇదంతా ఎక్కడో కాదండోయ్.. సాక్షాత్తు టీడీపీ అధినేత నారా చంద్రబాయుడునాయుడు సమక్షంలోనే. కనీసం వారిని వారించాల్సిన చంద్రబాబు అటు కన్నెత్తి చూడకుండా మిన్న కుండిపోవడం గమనార్హం. దీనికి గంగాధరనెల్లూరులో జరిగిన ‘రా కదిలిరా’ సభ వేదికై ంది.
సాక్షి, తిరుపతి : చంద్రబాబు సొంత జిల్లాలో రా కదలి రా సభ టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య చిచ్చుపెట్టింది. జనసేన శ్రేణులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాలు చంద్రబాబు సమక్షంలోనే తన్నుకోవాల్సి వచ్చింది. బాబు కళ్లెదుటే ఇదంతా జరుగుతున్నా ఆయన చూసీచూడనట్లు వెళ్లిపోయారు. సభలో జరుగుతున్న పరిణామాలను గమనించిన ఓ టీడీపీ కార్యకర్త జై జగన్ అంటూ నినదించారు. టీడీపీ వలంటీర్లు అతన్ని పట్టుకుని చితకబాదారు. మొత్తంగా బాబు సొంత జిల్లాలో మంగళవారం జరిగిన రా కదలి రా సభ తుస్ మంది.
అద్దె జనాలే దిక్కు
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మంగళవారం గంగాధరనెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన రా కదలి రా సభలో పాల్గొని ప్రసంగించారు. జిల్లా నేతల మధ్య సమన్వయం లేకపోవడం, జనంలో టీడీపీపై సదభిప్రాయం లేకపోవడంతో సభ పేలవంగా ముగిసింది. చంద్రబాబు సొంత జిల్లా కావడంతో రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా రెండు లక్షల మందితో సభను నిర్వహించాలని భావించారు. అయితే జిల్లా నేతలు జన సమీకరణ విషయంలో ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చంద్రబాబు వస్తున్నారని ఊరూరా ప్రచారం చేసినా స్థానికులు కూడా సభకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన నియోజకవర్గ ఇన్‌చార్జ్ థామస్ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి, అత్తింజేరిపేట నుంచి మనిషికి రూ.300 ఇచ్చి వాహనాల ద్వారా తీసుకొచ్చారు.
అయోమయంలో థామస్
రా కదలి రా సభను నిర్వహిస్తే అధినేత చంద్రబాబే స్వయంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని హామీ ఇచ్చారు. అందుకే రా కదలి రా కార్యక్రమానికి థామస్ భారీ ఎత్తున ఖర్చుచేశారు. ఇంత చేసినా.. చివరికి గంగాధరనెల్లూరు అభ్యర్థి అని చంద్రబాబు ప్రకటించకపోవడంతో థామస్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తను చెబితేనే థామస్ బయోకెమిస్ట్రీ చదివి డాక్టర్ అయ్యాడని బాబు కామెడీ చేశారు. అందుకే గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ని చేశానని ప్రకటించారు. అయితే ఎక్కడా ఎన్నికల్లో థామస్‌ని గెలిపించండి అని ప్రకటించ లేదు. మండల టీడీపీ నాయకులకు థామస్ సరైన గౌరవం ఇవ్వకపోవడంతో వారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. మండల నాయకులను చంద్రబాబుకు పరిచయం చేయమని అడిగినా థామస్ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు మౌనంగా ఎవరి దారిని వారు వెళ్లిపోవడం గమనార్హం.
జనసైనికులకు తీరని అవమానం
పొత్తులో భాగంగా టీడీపీ–జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నది అధినేతలు తీసుకున్న నిర్ణయం. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించ లేదు. ఒకరంటే ఒకరికి పడడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అందుకు గంగాధరనెల్లూరులో మంగళవారం చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనం. జీడీనెల్లూరులో రా కదలి రా సభ నిర్వహించాలని నిర్ణయించిన మొదలు జనసేన శ్రేణులకు ముందస్తు సమాచారం ఉండడం లేదు. పిలవాలి అనే భావనతో చివర్లో మొక్కుబడిగా ఫోన్‌చేసి పిలుస్తున్నారు.
సభ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో జనసేన అధినేత పవన్ ఫొటో, స్థానిక నాయకుల ఫొటోలు లేకపోవడం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోమవారం రాత్రి మండల జనసేన అధ్యక్షుడు సురేష్ రెడ్డి జనసేన జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం సభలో వెళ్తుంటే జనసేన శ్రేణులను టీడీపీ కార్యకర్తలు, వలంటీర్లు అడ్డుకున్నారు.
ఆగ్రహానికి గురైన జనసేన శ్రేణులు ‘పవన్ సీఎం.. జై పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులను వలంటీర్లు జనసేన నాయకులు, కార్యకర్తలను ఈడ్చిపడేశారు. దీంతో జనసేన శ్రేణులు తిరగబడడంతో ఇరువర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. జనసేన శ్రేణులు టీడీపీ వలంటీర్లు తరిమితరిమి కొట్టారు. చంద్రబాబు సమక్షంలోనే ఇంత జరుగుతున్నా వారించకుండా చూసీచూడనట్లు వెళిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment