ఏకపక్ష ‘బదిలీల’లు
ఉద్యోగుల బదిలీలంటే కొన్ని నిబంధనలు.. నియమాలు ఉంటాయి. తొలుత సినీయారిటీ గుర్తించాలి. బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆపై ఉద్యోగులకు కొంత వెసులుబాటు ఇవ్వాలి. వీటన్నింటికీ తిలోదకాలిచ్చారు.. ఎవరో బురదచల్లారు.. దాన్ని కడిగేయాలి.. అన్న చందంగా చిత్తూరు పోలీసు శాఖలో ఏకపక్షంగా బదిలీలలు సాగించారు ఉన్నతాధికారులు. దీనిపై పెదవి విరుస్తున్నారు చిరుద్యోగులు.
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు శాఖలో జరిగిన బదిలీల (డీఓలు) ప్రక్రియ.. ఆ శాఖను కుదిపేస్తోంది. మూడు రోజులుగా ఏకంగా 264 మంది సిబ్బందిని బదిలీ చేయడం.. అందులోనూ పుంగనూరు నియోజకవర్గంలోని సిబ్బందికి పూర్తిగా అక్కడి నుంచి స్థానచలనం కల్పించడంతో ఏ ఇద్దరు పోలీసులు తారాసపడినా.. బదిలీలపైనే చర్చిస్తున్నారు. కేవలం కూటమి ప్రజాప్రతినిధి పోలీసుశాఖపై రుద్దిన బురదను కడిగే ప్రయత్నంలో వందలాదిమంది సిబ్బందిని ఏకపక్షంగా బదిలీ చేయడంపై సిబ్బంది పెదవి విరుస్తున్నారు. సాధారణంగా సిబ్బంది బదిలీలు వేసవి సెలవులు పూర్తికావచ్చే సమయంలో నిర్వహిస్తారు. అప్పుడే పిల్లల్ని స్కూళ్లను మార్చడం, ఇళ్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది. పైగా తప్పనిసరిగా బదిలీలకు ఓ కటాఫ్ కాలాన్ని.. అంటే ఐదేళ్ల పాటు ఒకే స్టేషన్‌లో పనిచేసేవాళ్లను తప్పనిసరి బదిలీలోకి తీసుకురావడం, నాలుగేళ్లు, మూడేళ్ల కాలపరిమితి పనిచేస్తున్న వారిని కలిపి కౌన్సెలింగ్ నిర్వహించేవాళ్లు. ఏయే స్టేషన్‌లో ఖాళీలున్నాయో చూపి.. పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరిగేది. కానీ ఈ దఫా జరిగిన బదిలీల్లో ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పోలీసుశాఖపై అధికారపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సిబ్బందికి స్థానచలనం కల్పించారు. విద్యా సంవత్సరం ముగియడానికి మరో నెల గడువున్న నేపథ్యంలో ఉన్నట్టుండి జరిగిన బదిలీలపై పోలీసు కుటుంబాల పరిస్థితిని పెనంపై నుంచి పొయ్యిలోకి పడినట్లు అయ్యింది. సిబ్బంది స్థానచలనాల విషయంలో పైకి పుంగనూరు హత్య కనిపిస్తున్నా.. ఈపాపం మాత్రం కూటమి నేతలు మూటగట్టుకోక తప్పదనేది సుస్పష్టం. ఇంతటితో బదిలీల ప్రక్రియ ముగిసిపోలేదని.. ఇది తేనెతుట్టిను కదిపినట్లేనని తెలుస్తోంది. త్వరలో మరికొన్ని బదిలీలు జరగనున్నట్లు సమాచారం. పోలీసు సంక్షేమ కోసం ఏర్పాటైన పోలీసు యూనియన్ నాయకులు కూడా తమ గోడును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంపై జిల్లాలోని పోలీసులంతా ముక్త కంఠంతో యూనియన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రభుత్వ శాఖల్లోని సిబ్బందిలాగా ఉద్యోగులకు అన్యాయం జరిగినా, ఇబ్బందులు వచ్చినా ధర్నాలు, నిరసనలు చేసే ప్రక్రియ పోలీసుశాఖలో కుదరదు. సాటి పోలీసుల బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేని తరుణంలో యూనియన్ నాయకులు ఆ పోస్టులకు రాజీమానా చేయడం ఉత్తమమని సిబ్బంది బహిరంగంగానే దుమ్మెత్తిపోస్తున్నారు.
పోలీసుశాఖను కుదిపేస్తున్న ట్రాన్స్‌ఫర్లు
ఏ ఇద్దరు పోలీసులెదురైనా డీఓలపైనే చర్చ
పరీక్షలయ్యేంత వరకు సమయం కోరుతున్న వైనం
ఉన్నచోటిని కాపాడుకునేందుకు యూనియన్ మౌనం
వాస్తవాలను బహిర్గతం చేయలేకపోతున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment