సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌కి మరచిపోలేని రోజులా మారింది. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్ కట్టడి చేసే చహల్ ఈ రోజు ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఈ క్రమంలోనే చెత్త గణాంకాలను నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా అపప్రథను మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లలో వికెట్ మాత్రమే సాధించిన చహల్.. 89 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఒక భారత స్పిన్నర్‌గా వన్డేల్లో ఇది చెత్త రికార్డు. ఈ క్రమంలోనే తన రికార్డు తానే అధిగమించాడు చహల్. వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్ గా చహల్ పేలవ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు 2019 ఎడ్జ్‌బాస్టన్ వన్డేలో ఇంగ్లాండ్‌పై 88 పరుగులు ఇచ్చిన చహల్ ప్రస్తుతం తన రికార్డును తానే అధిగమించాడు.
ప్రధానంగా ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ లు చహల్ బౌలింగ్ పై విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కలిసి 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఫించ్ తన 17 వ వన్డే సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇదేకాక 126 ఇన్నింగ్స్‌లలో 5000 వన్డే పరుగులు వేగవంతంగా సాధించిన రెండో ఆస్ట్రేలియన్ ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును సాధించే క్రమంలో డీన్ జోన్స్(128 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును ఫించ్ సవరించాడు.ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు. వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా, టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా(90) వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, ధావన్(74) సైతం ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంచితే, వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరుగా రికార్డు పుస్తకాల్లో నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment