సాక్షి, పట్నా: బిహార్‌లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెహానాబాద్ జిల్లా నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది.
నలందా జిల్లాలోని తెలహాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన ట్రక్కు అదుపుతప్పి టెల్హడా ప్రాంతంలోని హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలకు తరలిస్తున్న క్రమంలో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. పోలీసులు, అధికారులు, వాహనాలపై కూడా రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment