ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్‌ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు.
చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్‌వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్‌లో నిందితులను అరెస్ట్ చేశారు.
ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment