
చెన్నై: ఇటీవల చెన్నైలో జరిగిన ల్యాప్‌టాప్ దొంగతనాలు చూస్తుంటే బాలీవుడ్ ధూమ్ చిత్రానికి ఏ మాత్రం తక్కువ కాదనిపిస్తుంది. ఎందుకంటే దోపిడీకి దొంగలు ఉపయోగించే వివిధ పద్ధతులను మనం చూసుంటాం, కానీ ఇది అంతకు మించి అనేలా ఉంది. పక్కాగా ప్లాన్ చేస్తూ ఓ దోపిడీ గ్యాంగ్ కార్ల నుంచి ల్యాప్‌టాప్ దొంగతనం చేయడానికి కేవలం రబ్బరు బ్యాండ్, మెటల్ బాల్‌లను ఉపయోగించి సింపుల్‌గా తస్కరిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు వాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు.
అసలు వారు దానిని ఎలా చేసారంటే.... మొదటగా దొంగతనానికి టార్గెట్‌గా ఒక కారు ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత, చుట్టు పక్కల ఎవరూ లేకుండా జాగ్రత్త పడతారు. చివరగా రబ్బర్ బ్యాండ్, మెటల్ బాల్‌ని ఉపయోగించి కారు విండోను పగలగొట్టేసి అందులోని విలువైన వస్తువులను స్వాహా చేస్తారు. ఈ దోపిడీ ముఠా అనేక సందర్భాల్లో ఈ విధంగానే ఫాలో అవుతూ వాహనాల అద్దాలను పగలగొట్టి, చెన్నై నగరంలో పార్క్ చేసిన కార్ల నుంచి కనీసం ఎనిమిది ల్యాప్‌టాప్‌లు, రూ .1.2 లక్షలు దొంగిలించారు. కాగా బెంగుళూరులోని ఒక రహస్య ప్రదేశంలో ఉండగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో, ఓ నిందితుడు వాళ్లు ఈ ప్లాన్‌ని పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో ఈ బండారం బయటపడింది. దీన్నంతటిని పోలీసులు వీడియో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశారు.
చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి