షెల్‌ కంపెనీతో సీఎం రమేశ్‌ టోకరా.. | CM Ramesh fraud with forged signatures | Sakshi
Sakshi News home page

షెల్‌ కంపెనీతో సీఎం రమేశ్‌ టోకరా..

Published Sun, Mar 24 2024 3:29 AM | Last Updated on Sun, Mar 24 2024 3:29 AM

CM Ramesh fraud with forged signatures - Sakshi

బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుతో రూ.450 కోట్లు స్వాహా

సంతకాలు ఫోర్జరీ చేసి.. తప్పుడు జీపీఏ సృష్టించి ఘరానా మోసం

ఉత్తరాఖండ్‌ వరకూ విస్తరించిన రిత్విక్‌ కంపెనీ అక్రమాలు

బాధితులు సినీనటుడు వేణు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కర్‌

పీసీఎల్‌ కంపెనీ ఫిర్యాదుతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు

కీలక ఆధారాలు అందించిన బాధితులు

ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఫోరెన్సిక్‌ పరీక్షల్లో నిర్ధారణ  

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో టీడీపీ కోటరీకి నాయకుడు సీఎం రమేశ్‌ అక్రమాల బాగోతం మరొకటి బయటపడింది. ఫోర్జరీ సంతకాలు చేసి షెల్‌ కంపెనీ ముసుగులో ఏకంగా రూ.450 కోట్లు కొట్టేసిన వ్యవహారం ఆధారాలతో సహా వెలుగుచూసింది. సీఎం రమేశ్, ఆయన సన్నిహితుడు పి. నాగేశ్వరరావు పక్కా స్కెచ్‌తో పాల్పడిన ఈ ఘరానా మోసంపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది.

సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్‌ స్వాతి అనే బోగస్‌ కంపెనీ పేరిట సబ్‌కాంట్రాక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి మరీ ఈ మోసానికి తెగబడ్డారు. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు, పీసీఎల్‌ ఇంటర్‌టెక్‌ లెన్‌హైడ్రో కాన్సా­ర్షియం జాయింట్‌ వెంచర్‌ ఆథరైజ్డ్‌ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు గత ఏడాదే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్‌ పాల్పడిన ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్‌ పోలీసులకు శనివారం అందించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఈ ఘరానా మోసం వివరాలిలా ఉన్నాయి.. 

పీసీఎల్‌ కన్సార్షియంకు తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు..  
ఉత్తరాఖండ్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు వద్ద సివిల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును పీసీఎల్‌ ఇంటర్‌టెక్‌ కన్సార్షియం  దక్కించుకుంది. ఈ మేరకు తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ)తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్రాజెక్టు వ్యవహారాలను  నిర్వహించేందుకు పీసీఎల్‌ కన్సార్షియం తమ ప్రతినిధిగా కావూరి భాస్కర్‌రావును జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటర్నీ (జీపీఏ) ద్వారా నియమించింది. 

కొంతకాలం ప్రాజెక్టు పనులు చేపట్టిన తరువాత పీసీఎల్‌ కన్సార్షియంకు టీహెచ్‌డీసీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ఆర్బిట్రేషన్‌కే చేరింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం కొనసాగుతోంది. పీసీఎల్‌ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్‌డీఏ న్యాయస్థానంలో డిపాజిట్‌ చేసింది.

ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్‌ మోసం.. 
ఇలా ఓ వైపు ఈ న్యాయ వివాదం కొనసాగుతుండగా.. సీఎం రమేశ్‌ గుట్టుచప్పుడు కాకుండా ఓ కథ నడిపించారు. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని పీసీఎల్‌ కన్సార్షియం 2011లో గుర్తించింది. ఆ మేరకు ఆయన ఓ జీపీఏను కూడా సృష్టించారని తెలుసుకుని షాక్‌కు గురైంది. అంతేకాదు.. తమ కన్సార్షియం ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆయన సీఎం రమేశ్‌కు చెందిన బోగస్‌ కంపెనీ రిత్విక్‌ స్వాతికి టీహెచ్‌డీఏ ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టును ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. వాటిని  చూపిస్తూ టీహెచ్‌డీఏ ప్రాజెక్టు బిల్లులు పొందేందుకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ స్వాతి కంపెనీ వ్యవహారం నడిపింది.

పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం పరిమిత కాల జీపీఏతో పీసీఎల్‌ కన్సార్షియం ప్రతినిధిగా టీహెచ్‌డీఏ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కానీ, ఆయన వ్యవహారశైలి నచ్చక ఆ జీపీఏ కాలపరిమితి ముగియగానే ఆయన్ని తొలగించారు. అయినాసరే.. తమ సంతకాలు ఫోర్జరీ చేసి మరోజీపీఏ సృష్టించుకోవడంతోపాటు.. సీఎం రమేశ్‌కు చెందిన బోగస్‌ కంపెనీ రిత్విక్‌ స్వాతితో తమ కంపెనీ పేరుతో సబ్‌ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లుగా పీసీఎల్‌ కన్సార్షియం గుర్తించింది.

ఈ ఒప్పందంలో పి.నాగేశ్వరరావు తన చిరునామాలో ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటను పేర్కొన్నారు. దీనిపై పీసీఎల్‌ కన్సార్షియం చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించగా ఆయన తప్పుడు చిరునామా ఇచ్చారని గుర్తించారు. అసలు చిరునామాను కూడా గుర్తించి వెల్లడించారు. షెల్‌ కంపెనీ ద్వారా నిధులు కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన ఆ బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు ఒప్పందం ద్వారా సీఎం రమేశ్, పి.నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పీసీఎల్‌ కన్సార్షియం ఈ విషయాన్ని ఈ–మెయిల్‌ ద్వారా టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిందని టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులు నిర్ధారించారు.

ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఫోర్జరీ నిర్ధారణ..  
మరోవైపు.. ఆ సబ్‌ కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను కావూరి భాస్కర్‌రావు ట్రూత్‌ల్యాబ్‌ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు. పి. నాగేశ్వరరావు, రిత్విక్‌ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని పీసీఎల్‌ కన్సార్షియం ప్రతినిధులైన తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని తేలింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు  గత ఏడాది నవంబరు 4న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి ఫోర్జరీ సంతకాల విషయాన్ని నిర్ధారించాలని కోరారు. తప్పుడు ఒప్పందంతో తమ కంపెనీని మోసం చేసిన సీఎం రమేశ్, పి. నాగేశ్వరరావులపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వీరి మోసానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో వారిపై హైదరాబాద్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైద రాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డిని శని వారం కలిసి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసు కు సంబంధించి తాము సేకరించిన మరి­న్ని కీలకపత్రాలను కూడా పోలీసులకు అందించారు.

సీఎం రమేశ్‌ రూ.450 కోట్లు కొల్లగొట్టారు : కావూరి భాస్కర్‌రావు 
‘పీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి సంబంధించి సీఎం రమేశ్‌ ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాను. దాదాపు అరగంట పాటు నా స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. ఈ ఫోర్జరీ ద్వారా సీఎం రమేశ్‌ దాదాపు రూ.450 కోట్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి కోర్టులోనూ ఓ కేసు నడుస్తోంది. సీఎం రమేశ్‌పై సీబీఐ దర్యాప్తు జరిగితే రూ.వేల కోట్ల స్కాంలకు సంబంధించిన విషయాలు బయటకొస్తాయి’.. అని కావూరి భాస్కర్‌రావు మీడియాకు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement