ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో ఉన్న ఘజియాబాద్ సమీపంలోని షహద్ర ప్రాంతం నకిలీ బాబాలకు అడ్డాగా మారింది. లోకల్, యూట్యూబ్ ఛానళ్లను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్న ఈ బురిడీ బాబాలు ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తూ యాడ్స్ ఇస్తున్నారు. ఎలాంటి బాధల నుంచి అయినా పూజల ద్వారా విముక్తి కల్పిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఆపై అందినకాడికి వసూలు చేసి నిండా ముంచుతున్నారు. వీరి బారినపడుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు.
⇔ రెండు నెలల క్రితం రూ.లక్ష మోసపోయానంటూ పాతబస్తీకి చెందిన ఓ బాధితురాలు ఫిర్యాదు చేయగా... రూ.4 లక్షలు ‘సమర్పించుకున్న’ మరో మహిళ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
⇔ సిద్ధిపేటకు చెందిన ఓ మహిళకు తన భర్తతో విభేదాలు రావడంతో కొన్నాళ్ళుగా అతడికి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం అంబర్‌పేటలో ఉండే తన సోదరుడి వద్ద నివసిస్తోంది. ఎవరో తన భర్తకు మందు పెట్టారని, అందుకే తనను వదిలేశాడనేది ఈమె నమ్మకం. అప్పటి నుంచి ఆ మందుకు విరుగుడు కోసం ప్రయత్నిస్తోంది.
⇔ ఈ నేపథ్యంలో ఓ లోకల్ ఛానల్‌లో బాబా జాఫర్ ఖాన్, కాశ్మీరీ బాబా, బెంగాలీ బాబా, తాంత్రిక్ బాబా పేరుతో వచ్చిన యాడ్ ఈమె గమనించింది. తనను కలవాల్సిన అవసరం లేకుండా కేవలం పూజల ద్వారానే ఆరోగ్య, కుటుంబ, దాంపత్య సమస్యల్ని దూరం చేస్తానంటూ అందులో బురిడీ బాబా పేర్కొన్నాడు.
⇔ సదరు ఛానల్‌లో ఈ ప్రకటన చూసిన మహిళ అందులోని ఫోన్ నెంబర్‌లో సంప్రదించారు. విషయాన్ని బురిడీ బాబాకు చెప్పగా క్షుద్రపూజల కారణంగా అలా జరిగిందని, పూజలు చేసి కాపురాన్ని సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి రూ.5600 చెల్లించాలని కోరాడు.
⇔ ఈ మొత్తం గూగుల్ పే ద్వారా అందిన తర్వాత పూజ మొదలెట్టానని, సామగ్రి ఖరీదు చేయడానికి మరో రూ.33 వేలు కావాలన్నాడు. ఆపై మరికొన్ని వస్తువులు కొనాలంటూ ఇంకో రూ.42 వేలు కాజేశాడు. ఆపై ఆమెను సంప్రదించిన బాబా పూజ మధ్యలో ఆగిందంటూ చెప్పాడు.
⇔ అలా ఆగిపోతే మీ ఇంట్లో విషాదం జరుగుతుందని, ఆనారోగ్యం పాలవుతారంటూ భయపెట్టాడు. పూర్తి చేయడానికి మరో రూ.66 వేలు మరుసటి రోజు ఉదయానికి పంపమన్నాడు. ఆమె నగదును ఆ రోజు సాయంత్రానికి బదిలీ చేయగా... టైమ్ దాటాక పంపడంతో పూజ తంతు కాలేదని, మళ్ళీ అంతే మొత్తం పంపాలన్నాడు.
⇔ ఇలా సదరు బాబాకు రూ.4 లక్షలు చెల్లించిన బాధితురాలు తాను మోసపోయానని గుర్తించారు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు బాధితురాలు నగదు బదిలీ చేసిన గూగుల్ పే నెంబర్ పరిశీలించారు.
⇔ ఈ నెంబర్‌కు రెండు నెలల క్రితం రూ.లక్ష పంపి మోసపోయిన మరో బాధితురాలూ ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో బాబాను పట్టుకోవడానికి షహద్ర ప్రాంతానికి సైబర్ క్రైమ్ పోలీసులు
⇔ వెలుగులోకి రాని బాధితులు ఇంకా అనేక మంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాళ్ళు బయటకు రాలేదని భావిస్తున్నారు. సదరు బురిడీ బాబాను పట్టుకోవడానికి మరో టీమ్‌ను ఉత్తరాదికి పంపాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment