CRPF Commando May Have In Maoists Custody, Wife Appeals For Safe Return - Sakshi
Sakshi News home page

మా అధీనంలోనే కోబ్రా కమాండో

Published Tue, Apr 6 2021 2:51 AM | Last Updated on Tue, Apr 6 2021 9:48 AM

CRPF Commando May Be In Maoists Custody - Sakshi

మావోయిస్టులను వేడుకుంటున్న జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ కూతురు

చర్ల/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని తెర్రం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోబ్రా బెటాలియన్‌ కమాండో రాకేశ్వర్‌సింగ్‌ ఆచూకీ కనిపించకుండా పోయింది. ఆయనను తామే అపహరించినట్టుగా మావోయిస్టులు ప్రకటించారు. నిజంగానే మావోలు రాకేశ్వర్‌ను అపహ రించారా అన్నది నిర్ధారించుకు నేందుకు సెక్యూరిటీ దళాలు, నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆయన ప్రాణా లతో క్షేమంగానే ఉన్నారా? లేక మళ్లీ పోలీసు బలగాలను ట్రాప్‌ చేసేందుకు కుట్ర పన్నారా? అలాకాకుండా తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఇలా కమాండో తమ అదుపులో ఉన్నాడని చెబుతూ బలగాల దూకుడుకు బ్రేక్‌ వేస్తున్నారా అన్న అనుమానాలను పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నాప్‌ నిజమే కావొచ్చన్న అధికారులు!
జమ్మూకు చెందిన రాకేశ్వర్‌సింగ్‌ 210 కోబ్రా బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఆయన తోటి జవాను ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. రాకేశ్వర్‌ ఆచూకీ తెలియరాలేదు. అయితే మావోల ప్రకటనను నమ్మేందుకు కారణాలున్నాయని సెక్యూరిటీ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. కమాండోను అపహరించామని మావోయిస్టులు ఆదివారం ఫోన్‌ ద్వారా ఒక జర్నలిస్టుకు వెల్లడించారు. ఆ కాల్‌ చేసింది దాడికి సూత్రధారి అయిన హిడ్మా అని సదరు జర్నలిస్టు చెప్పారు. మావోయిస్టులు చెప్పినట్టే కమాండో రాకేశ్వర్‌సింగ్‌ ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదని.. అయితే నిజంగా నక్సల్స్‌ చేతికి ఆయన చిక్కారనేందుకూ గట్టి ఆధారాల్లేవని అధికారులు అంటున్నారు.

సంప్రదింపులపై దృష్టి
జవాన్‌ తమ ఆధీనంలో ఉన్నాడంటూ మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు హక్కుల సంఘం నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అక్కడి హక్కుల నాయకుడు సోను సోరుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మీడియా ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరిపి.. మావోయిస్టుల నుంచి జవాన్‌ను విడిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా బయటపడాలని ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు, అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

విడిపించండి..ప్రధాని మోదీ, అమిత్‌షాలకు రాకేశ్‌ భార్య విజ్ఞప్తి
రాకేశ్వర్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా చర్యలు తీసుకోవాలని కమాండో భార్య మీనూ మన్హాస్‌ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ నుంచి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను విడిపించినట్టుగా.. తన భర్తను మావోయిస్టుల చెర నుంచి విడిపించాలని ఆమె వేడుకున్నారు.

ప్లీజ్‌ అంకుల్‌.. మా నాన్నను విడిచిపెట్టండి
‘అంకుల్‌.. ప్లీజ్‌.. మా నాన్నను విడిచిపెట్టండి’ అంటూ కమాండో రాకేశ్వర్‌సింగ్‌ కుమార్తె మావోయిస్టులను వేడుకుంది. తన తండ్రిని తల్చుకుని ఏడుస్తూ.. విడిచిపెట్టాలని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి వీడియోను చూసిన వారంతా సానుభూతితో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

చదవండి: మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement