సాక్షి, హైదరాబాద్: ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీస్‌స్టేషన్‌లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహార్‌కు చెందిన నితీశ్(32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.
అయితే, క్యాంపులోని కూలీలు శనివారం రాత్రి 11 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించి.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే వీరిలో నితీశ్ ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు.
పోలీసు సిబ్బంది అది గమనించి తొలుత సీపీఆర్ చేశారు. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇస్తూ.. కూలీలు, సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరగడంతో అదుపులోకి తీసుకున్నామని, ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు
Comments
Please login to add a commentAdd a comment