బందిపోటు శెట్టి ‘కేసు’ క్లోజ్‌!  | Dacoit Manish Shetty Alias Sarvotham Shetty Deceased In Karnataka | Sakshi
Sakshi News home page

బందిపోటు శెట్టి ‘కేసు’ క్లోజ్‌! 

Published Sat, Oct 24 2020 7:01 AM | Last Updated on Sat, Oct 24 2020 7:08 AM

Dacoit Manish Shetty Alias Sarvotham Shetty Deceased In Karnataka - Sakshi

హతుడు, నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు విభాగానికి ‘సుపరిచితుడైన’ మనీష్‌ శెట్టి అలియాస్‌ ఆర్‌ సర్వోత్తమ్‌ శెట్టి కథ ముగిసింది. కొన్నేళ్ల క్రితం అబిడ్స్‌లోని రాజ్యలక్ష్మీ జ్యువెలర్స్‌లో బందిపోటు దొంగతనానికి పాల్పడిన ముఠాకు లీడర్‌ ఇతడు. ఈ కేసు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మూడు రాష్ట్రాల్లో 25కు పైగా భారీ కేసులో నమోదై ఉన్న ఈ శెట్టిని ప్రత్యర్థులు గత వారం బెంగళూరులో హత్య చేశారు. దీనిపై నగర పోలీసు విభాగానికి సమాచారం అందింది.  

  • కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన మనీష్‌ శెట్టి ముంబైలో ఓ హోటల్‌లో సప్లయర్‌ కమ్‌ క్లీనర్‌గా చేరాడు. ఈ రకంగా వస్తున్న ఆదాయం కంటికి ఆనకపోవడంతో తన పంథా మార్చారు.
  • నేరజీవితం ప్రారంభించిన మనీష్‌ శెట్టి తొలినాళ్లలో ఒంటరిగానే ముంబై లోకల్‌ రైళ్లల్లో జేబులు కత్తిరించాడు. ఆపై ఓ ముఠాను ఏర్పాటు చేసు కుని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులతో పా టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. 
  • జ్యువెలరీ దుకాణాలు, పెద్ద పెద్ద దుకాణాలు, బ్యాంకుల్లో దోపిడీలు, బందిపోటు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉత్తరాదికి చెందిన మాఫియా డాన్లు రవి పుజారీ, జన్నన్‌ జీ రాజా, ముత్తప్ప రాయ్‌లతో పరిచయం ఏర్పడింది. 
  • ఓ హత్యాయత్నం కేసులో అరెస్టై, నాసిక్‌ జైలుకు వెళ్ళిన శెట్టికి అక్కడే ఘరానా దొంగలైన వసంత్‌ సాలియానా, గోపాల్‌ రమణ శెట్టి, రవి కువూర్‌ అన్నా గౌడ, సర్వమిత్ర అలియాస్‌ వునీష్‌ అలియాస్‌ రాజు శెట్టి, విశ్వనాథ్‌ బాబు పిలాల్, రమేష్‌లతో పరిచయం ఏర్పడింది. 
  • వీరితో పాటు మరికొందరితో కలిసి హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ నగరానికి చేరుకుని తమ ‘పని’ పూర్తి చేద్దామని అంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బయట ఉన్న అనుచరులకూ చేరవేశారు. 
  • పథకం ప్రకారం 2006 ఏప్రిల్‌లో నగరానికి చేరుకున్న ఈ గ్యాంగ్‌ అబిడ్స్‌లోని రాజ్యలక్ష్మి జ్యువెలర్స్‌పై పంజా విసిరింది. రాత్రి 9.10 గంటల సమయంలో దుకాణం మూసే ముందు ఆయుధాలతో లోపలికి ప్రవేశించారు. 
  • ఈ దుండగులు రూ.1.5 కోట్ల విలువైన సొత్తును కేవలం 15 నిమిషాల్లో చేజిక్కించుకుని తమ క్వాలిస్‌ వాహనంలో ఉడాయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్, వసంత్‌లతో కూడిన గ్యాంగ్‌ పనిగా మెుత్తం 13 మంది పాల్గొన్నట్లు గుర్తించింది.  
  • వీరు ముంబై కేంద్రంగా ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నారని గుర్తించి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుంది. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన శెట్టి తన మకాంను మహారాష్ట్ర నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు మార్చాడు.  
  • 2007 ఆగస్టులో అక్కడి బసన్వాడీ ప్రాంతంలో ఉన్న ఓ జ్యువెలరీ దుకాణంపై తన గ్యాంగ్‌తో పంజా విసిరి 5 కేజీల బంగారం దోచుకుపోయాడు. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉండగానే కేరళకు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ను చంపడానికి సుపారీ తీసుకున్నాడు. 
  • శెట్టి ఈ హత్య చేయడానికి మహ్మద్‌ ఖున్నీ అనే సుపారీ కిల్లర్‌ను పంపాడు. ఇతడు కేరళ పోలీసులకు చిక్కడం, విచారణలో శెట్టి పేరు బయటపెట్టడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ఇలా ఇతడిపై మొత్తం 25 భారీ కేసులు నమోదయ్యాయి. 
  • 2015లో శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన శెట్టి బెంగళూరులోని వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో కెఫెటేరియాలు కాంట్రాక్టు తీసుకుంటూ గడిపాడు. 2018లో అక్కడి రెస్ట్‌ హౌస్‌ రోడ్‌లో ఉన్న డ్యూట్‌ బార్‌ను లీజుకు తీసుకున్నాడు. 
  • గత గురువారం ఈ బార్‌ నుంచే బయటకు వచ్చిన శెట్టిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు గత శనివారం నలుగురిని అరెస్టు చేశారు. 
  • ఆధిపత్య పోరు నేపథ్యంలోనే కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన శశికాంత్, అక్షయ్, గణేష్, నిత్య కలిసి శెట్టిని చంపారని తేల్చారు. శెట్టిని మృతికి సంబంధించిన బెంగళూరు పోలీసులు నగర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారిక పత్రాలు సేకరించడానికి ఇక్కడి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.  

‘అత్యాచారం’ కేసులో డాలర్‌ భాయ్‌ అరెస్టు 
సాక్షి, సిటీబ్యూరో: పదకొండేళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రాజశ్రీకర్‌ అలియాస్‌ డాలర్‌ భాయ్‌ని సీసీఎస్‌ మహిళా ఠాణా అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలికి ‘అండగా’ ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాలర్‌ భాయే ప్రధాన నిందితుడిగా మారాడు. ఈ కేసును పూర్తిస్థాయిలో సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నామని, వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి మీడియాకు తెలిపారు.  

పంజగుట్ట రాణాలో కేసు నమోదు... 
తనపై అనేక మంది అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పంజగుట్ట ఠాణాలో ఈ కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కొందరు ప్రముఖులకు కూడా ఉన్నారు. దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి ఈ కేసు బదిలీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సకత రేపిన ఈ కేసు దర్యాప్తు కోసం సీసీఎస్‌ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవిని ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తుండగానే బాధితురాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సోమాజిగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ, తనకు సాయం చేస్తున్నట్టు నటించిన రాజశ్రీకర్‌ అలియాస్‌ డాలర్‌ భాయ్‌ కారణంగానే ఈ ఫిర్యాదు చేశానని పేర్కొంది. అతగాడు చెప్పిన పేర్లు తన ఫిర్యాదులో పొందుపర్చానని చెప్పింది.  దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఈ కేసులో డాలర్‌ భాయ్‌ని ప్రధాన నిందితుడిగా చేర్చారు.  

ప్రమేయం ఉన్నవారిపై చర్యలు... 
భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండటానికి బాధితురాలితో న్యాయస్థానంలోనూ 164 స్టేట్‌మెంట్‌ రికార్డు చేయించారు. మాజీ భార్య ఫిర్యాదుతో డాలర్‌ భాయ్‌పై సీసీఎస్‌ మహిళా ఠాణాలో గతంలోనూ కేసు నమోదై ఉంది. ఫోన్‌ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరిని ఇప్పటికే విచారించామని, ఆధారాలను బట్టి ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. 

నిమిషాల్లో కేసు కొలిక్కి! 
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అందుబాటులోకి వచ్చినా... పోలీసుల్లో సమయస్ఫూర్తి లేకపోతే పూర్తి స్థాయి ఫలితాలు ఉండవు. ఈ రెంటినీ జోడించిన ఆసిఫ్‌నగర్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు ఓ సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసును కేవలం అర్ధగంటలో ఛేదించారు.  నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ బృందాన్ని శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించి అభినందించి జ్ఞాపికలు అందించారు. ఈ కేసుకు  సంబంధించిన ‘క్లూ’ ఏమిటంటే... 

పిల్లర్‌ నెం.28 వద్ద స్నాచింగ్‌... 
నిర్మల్‌ జిల్లాకు చెందిన జి.రోజా నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిని. మెహిదీపట్నం అయోధ్యనగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈమె ఇటీవల ఓ రోజు రాత్రి 7.30కి  మెహిదీపట్నంలోని పిల్లర్‌ నం.28 మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా..  ద్విచక్రవాహనంపై పక్కనుంచే వచ్చిన ఓ యువకుడు చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కొని ఉడాయించాడు. 

విషయం తెలిసిన మరుక్షణం... 
రోజా సమీపంలో ఉన్న ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌ తీసుకుని ‘డయల్‌–100’కు ఫోన్‌ చేశారు. ఈ కాల్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆసిఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన బ్లూ కోల్ట్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌కు అందించింది. వెంటనే ఆయన పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న క్రైమ్‌ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ అప్రమత్తమయ్యారు. బాధితురాలు ‘100’కు ఫోన్‌ చేసిన నంబర్‌ తెలుసుకొని దానిని సంప్రదించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి బాధితురాలి నుంచి ఆమెకు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

ఆ యాప్‌ సహాయంతో ముందుకు...
రోజా విద్యాధికురాలు కావడం, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉండటంతో ఆమె ఫోన్‌లో కచ్చితంగా ట్రాకింగ్‌ యాప్స్‌ ఉంటాయని భావించారు. ఇదే విషయాన్ని రోజాను అడగ్గా... తన ఫోన్‌లో ట్రాక్‌ మై డివైజ్‌ యాప్‌ ఉందని చెప్పారు. దీంతో భాస్కర్‌తో కలిసి బయలుదేరిన శ్రీకాంత్‌... ఆమె యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకున్నారు. వీటిని వినియోగించి తన ఫోన్‌ నుంచే ఆ యాప్‌లోకి గెస్ట్‌గా లాగిన్‌ అయ్యారు. దీంతో ఆ డివైజ్‌ (ఫోన్‌) గోల్కొండ వైపు వెళ్లి... అక్కడే స్విచ్ఛాఫ్‌ అయినట్లు యాప్‌ చూపించింది.  

రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన నిందితుడు ... 
సదరు యాప్‌ చూపించిన దిశలో వెళ్లిన శ్రీకాంత్, భాస్కర్‌లు ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ యువకుడు చేతిలో రెండు ఫోన్లు ఉండటం గమనించి పట్టుకున్నారు. ఫోన్లను పరిశీలించగా వాటిలో రోజాకు చెందిన నీలిరంగు ఫోన్‌ కూడా ఉంది. నిందితుడు గోల్కొండకు చెందిన అథర్‌గా గుర్తించి స్టేషన్‌కు తరలించారు. రోజా ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కానిస్టేబుళ్లల్లో ఇలాంటి స్ఫూర్తి నింపిన డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రవీందర్, ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను కమిషనర్‌ అభినందించారు. 

స్నేహితుడితో కలిసి టీవీల చోరీ 
సనత్‌నగర్‌: తాను పని చేస్తున్న సంస్థలో స్నేహితుడితో కలిసి 27 టెలివిజన్‌ సెట్లను అపహరించాడో వ్యక్తి. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఠాణాలో శుక్రవారం ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రాంగోపాల్‌పేట నల్లగుట్టకు చెందిన నీలం ప్రణీత్‌ సాయి (21) బేగంపేటలోని సామ్‌సంగ్‌ డీలర్స్‌ అయిన త్రివిక్రమ గోడౌన్‌లో చెక్స్‌ కలెక్షన్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇతను గోడౌన్‌లోని 32 ఇంచుల సామ్‌సంగ్‌ టీవీలు రోజుకొకటి చొప్పున చోరీ చేసి.. తన స్నేహితుడు ఠాక్రే హరీందర్‌ (19) సహాయంతో వాహనంలో తరలించేవాడు. గోడౌన్‌లోని టీవీలు చోరీ అవుతుండటంతో  నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు  ప్రణీత్‌సాయి, హరీందర్‌ లను అదుపులోకి తీసుకుని విచారించగా తామే చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. పోలీసులు వీరి అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును ఛేదించిన బేగంపేట ఠాణా సిబ్బందిని ఏసీపీ అభినందించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాసరావు, డీఐ శేఖర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement