నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ వెంకటరెడ్డి
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు.
వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్‌లైన్‌లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్‌నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు.
అనుమానంతో కదిలిన డొంక
వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment