రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
భీమవరంలో శిలాఫలకాల విధ్వంసం
ప్రకాశంలో జిల్లాలో వైఎస్సార్ విగ్రహంపై దాష్టీకం
తెనాలి అర్బన్/భీమవరం (ప్రకాశం చౌక్)/నాగులుప్పలపాడు: అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం యథేచ్ఛగా గత ప్రభుత్వంలో ఏర్పాటైన అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అలాగే దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని పగులకొట్టారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి 13వ వార్డులో రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాన్ని తాజాగా టీడీపీ కార్యకర్తలు పగులకొట్టారు. అలాగే ఐదో వార్డులో కౌన్సిలర్ తోట రఘురామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
భీమవరంలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శిలాఫలకాలను జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం టూటౌన్‌లో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను జనసేన, టీడీపీకి చెందిన అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ప్రశాంతమైన భీమవరంలో ఈ దుశ్చర్య దారుణమని స్థానికులు మండిపడ్డారు.
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని నడిరోడ్డులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద బండరాయితో తొలుత మెడ భాగంలో పగలగొట్టి తల భాగం తీసేయాలని ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో ఎడమ చేతిని బండరాయితో బలంగా కొట్టడంతో ఆ భాగం పూర్తిగా విరిగిపోయింది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఫిర్యాదు మేరకు నాగులుప్పలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ ఇంటిపై రాళ్ల దాడి
కొమ్మాది (విశాఖ): గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 4వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చేపలుప్పాడలో కొండబాబు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఎలివేషన్ అద్దాలు పగిలిపోయాయి.
రాత్రి పెద్ద శబ్దాలు రావడంతో బయటకు వచ్చి చూశానని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ కొండబాబు తెలిపారు. అదే సమయంలో కరెంటు లేకపోవడంతో ఎవరు దాడి చేశారో కనబడలేదన్నారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారమివ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారని, వారిని చూసి గుర్తు తెలియని వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. శనివారం భీమిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఈ దాడులను మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, అవంతి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అండగా ఉంటామని తెలిపారు. దాడులు చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుల బరితెగింపు
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతూపొంతూ ఉండటం లేదు. శనివారం తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సజ్జలదిన్నె రాజు అనుచరుడు వేణుగోపాల్‌రెడ్డికి చెందిన నాపరాళ్ల ఫ్యాక్టరీలో బండలను ధ్వంసం చేశారు.
దాదాపు 20 చదరాల బండలు ధ్వంసం అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వారే ధ్వంసం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రవీంద్రారెడ్డి తన రెండెకరాల పొలంలో నెల క్రితం సాగు చేసిన పత్తి పంటను టీడీపీ వర్గీయులు శనివారం దున్నేసి నాశనం చేశారు.
అదే గ్రామానికి చెందిన ఆలూరు రామాంజులరెడ్డి, జూటూరు రామాంజులరెడ్డి ట్రాక్టర్‌తో తన పంటను దున్నేసినట్లు బాధితుడు వాపోయాడు. దాదాపు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు స్వీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment