అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట శివారు 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన కాల్వలో కుక్కల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. పదిహేను వీధి కుక్కలను గుర్తు తెలియని దుండగులు చంపి వాటిని కాల్వలో పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ సుజాత అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
అనంతరం కుక్కల కళేబరాలను ట్రాక్టర్‌లో చక్రాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తరలించి అక్కడ పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుంతను తవి్వంచి పూడ్చి వేశారు. కుక్కల కళేబరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు.కుక్కలకు సంబంధించిన శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్‌ఖన్న తెలిపారు.
పొన్నకల్ ఘటన మరువక ముందే?
అసలు ఈ కుక్కలను ఎవరు.. ఎక్కడ.. ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో గ్రామంలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపేసి కళేబరాలను ఇక్కడ వదిలేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అడ్డాకుల మండలం పొన్నకల్‌లో 21 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు 15 కుక్కల కళేబరాలు హైవే పక్కన కాల్వలో కనిపించడం కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment