రైతు పొలంలో సీబీఐ అధికారులు
లక్నో : హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. అధికారులు.. బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అయిందని క్రైం సీన్ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల దళిత బాలిక అత్యాచారానికి గురైన బూల్‌గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు పలుమార్లు పరిశీలించారు. క్రైం సీన్‌ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. ( ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం )
దీనిపై సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘క్రైం సీన్లోని ఆధారాలను పరిరక్షించటానికి దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment