డిచ్‌పల్లిలో శిశువును విక్రయించిన కొమురయ్య డిచ్‌పల్లిలో శిశువుతో ఆశ వర్కర్
డిచ్‌పల్లి/అశ్వారావుపేట రూరల్: కన్నతండ్రులే కాసులకు కక్కుర్తి పడి పేగుబంధాన్ని తెంచుకోజూశారు.. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులను అమ్మకానికి పెట్టారు.. రెండు వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు పసికందులను విక్రయించిన తండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించి వారి ఆచూకీ తెలుసుకున్నారు. ఆ శిశువులను తీసుకొచ్చి తల్లుల ఒడికి చేర్చా రు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
సిద్దిపేట జిల్లాకు చెందిన భీమవ్వ, కొమురయ్య దంపతులు సంచారజాతికి చెందినవారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కుమారులు పఠాన్‌చెరులోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటున్నారు. పాపతో కలసి ఆ దంపతులు రెండు నెలల క్రితం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ మహాలక్ష్మీనగర్ కాలనీకి వలస వచ్చారు. గుడారంలో ఉంటూ రోడ్ల పక్కన చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు.
గర్భిణీ అయిన భీమవ్వ శనివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ఆశ వర్కర్ తల్లీబిడ్డలను డిచ్‌పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్య సిబ్బంది శిశువు తక్కువ బరువుతో ఉన్నాడని, వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, వారు నిజామాబాద్‌కు కాకుండా తమ గుడారం వద్దకు చేరుకున్నారు. సమీపంలోని బట్టీలో ఆ ఇద్దరు దంపతులు కల్లు తాగుతుండగా ధర్మారం(బి) గ్రామానికి చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. కొమురయ్యకు మాయమాటలు చెప్పి, రూ.2,500 ఇచ్చి బాలుడ్ని తీసుకెళ్లాడు.
మత్తు దిగిన తర్వాత భీమవ్వ శిశువు గురించి భర్తను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో కొమురయ్య అసలు విషయం చెప్పడంతో ధర్మారం(బి)లోని లక్ష్మణ్ ఇంటికి పోలీసులు చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భీమవ్వను, శిశువును జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు. అయితే, తాను శిశువును కొనుగోలు చేయలేదని, రాత్రి వారి గుడారం దగ్గర నుంచి వెళ్తుండగా తల్లిదండ్రులు కల్లు మత్తులో సోయి లేకుండా పడిపోయి ఉన్నారని, శిశువు ఏడుస్తుండటంతో ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే అనుమానంతో ఇంటికి తీసుకొచ్చినట్లు లక్ష్మణ్ పోలీసులకు తెలిపారు.
రూ. 2 లక్షలకు విక్రయించిన తండ్రి
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన ఘంటా అరుణ్‌కుమార్ భార్య చిలకమ్మ ఈ నెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్, అత్త ఘంటా మేరీ కలిసి శిశువును చింతలపూడి మండలానికి చెందిన ఆర్‌ఎంపీలు బుచ్చిబాబు, శ్రీనివాస్, అశ్వారావుపేటకు చెందిన ప్రశాంతి సహకారంతో విశాఖకు చెందిన ఓ వ్యక్తి కి రూ. 2 లక్షలకు అమ్మేశారు.
శిశువు విషయమై అల్లిపల్లి అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మి, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆరా తీయగా విక్రయించినట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అరుణ్‌కుమార్, మేరితోపాటు బుచ్చిబాబు, శ్రీనివాస్, ప్రశాంతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా అరుణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment