ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాని సుధీర్
మైదుకూరు: తాము అక్రమంగా దాచి ఉంచిన మద్యం బాటిళ్లలో రెండు బాటిళ్లను దొంగిలించాడనే నెపంతో ఐదుగురు వ్యక్తులు ఓ 17 ఏళ్ల యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి. వనిపెంట, పరిసర గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి వాటిని స్థానిక నాలుగు రోడ్ల వద్ద తుప్పల్లో దాచి ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఆదివారం తాము దాచిన మద్యం బాటిళ్లలో రెండు తక్కువగా ఉన్నట్లు గమనించారు.
వాటిని వనిపెంట ఎస్సీ కాలనీకి చెందిన యంగోళ్ల నానిసుధీర్ అనే యువకుడే దొంగిలించి ఉంటాడని భావించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నాలుగు రోడ్ల వద్ద ఉన్న మెకానిక్ షెడ్ వద్ద నాని సుధీర్‌ను పట్టుకుని కొట్టారు. అయితే తాను మద్యం దొంగతనం చేయలేదని సుధీర్ మొత్తుకున్నప్పటికీ పట్టించుకోని నిందితులు.. పెట్రోల్‌ను అతని ముఖంపై పోసి నిప్పంటించారు. దీంతో ముఖం, ఛాతి, చేతులు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. సుధీర్ చనిపోతాడేమోనని భయపడిన నిందితులు అతన్ని బైక్‌పై ఎక్కించుకుని మైదుకూరు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కారులో కడపకు తరలించి అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న నాని సుధీర్ కుటుంబ సభ్యులు కడపకు చేరుకుని అతన్ని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment