విద్యార్థినులు వసతి పొందుతున్న హాస్టల్
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు.
చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని..
వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్‌చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు.
కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment