రెచ్చిపోతున్న ఆన్‌లైన్‌ మోసగాళ్లు.. | Fraud In The Name Of E Commerce Sites | Sakshi
Sakshi News home page

బురిడీగాళ్లతో బహుపరాక్‌

Published Thu, Apr 22 2021 10:26 AM | Last Updated on Thu, Apr 22 2021 10:26 AM

Fraud In The Name Of E Commerce Sites - Sakshi

నగదు జమ చేసినట్లు నకిలీ రశీదు- పోస్టులో వచ్చిన స్క్రాచ్‌కార్డు

శ్రీకాళహస్తిలో ఆన్‌లైన్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.  ఈ–కామర్స్‌ వెబ్‌సైట్స్‌ పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. స్క్రాచ్‌ కార్డ్‌లను పంపించి వంచిస్తున్నారు.. అకౌంట్‌ నగదు జమచేశామని నకిలీ రశీదులతో వలేస్తున్నారు.. నమ్మినవారి సొమ్ము కాజేస్తున్నారు. నమ్మకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అంటూ చాలామంది బాధితులు తలపట్టుకుంటున్నారు. కొందరు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

శ్రీకాళహస్తి: పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన సుజాత అనే మహిళకు స్నాప్‌డీల్‌ పేరుతో పోస్టులో ఇటీవల ఓ లేఖ, స్క్రాచ్‌ కార్డ్‌ వచ్చింది. కార్డ్‌ను రఫ్‌ చేస్తే అందులో ఉంటే నగదును మీ ఖాతాలో జమచేస్తామని ఉంది. దీంతో ఆమె స్క్రాచ్‌  కార్డును రఫ్‌ చేయగా అందులో రూ.6లక్షల అంకె వచ్చింది. కొంతసేపటి తర్వాత సుజాతకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. జీఎస్టీ కింద రూ.7వేలు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే మీకు రూ.6లక్షలు పంపిస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని సుజాత తమ వారికి తెలియజేయగా వారు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. మళ్లీ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీ ఖాతాలో రూ.6లక్షలు వేశామని, కావాలంటే చూసుకోమంటూ బ్యాంకు ఓచరు, ఫోన్‌ పే ద్వారా నగదు జమ చేసినట్లు ఓ మెసేజీని పంపించాడు.

సుజాత స్పందించకపోవడంతో ఫోన్‌లో తిట్లు లంకించుకున్నాడు. దీనిపై బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పట్టణంలోని భాస్కరపేటకు చెందిన దొర అనే వ్యక్తికి సైతం ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో ఇలాంటి  మెసేజీనే వచ్చింది. ఫోన్‌ పే ద్వారా రూ.7వేలు చెల్లిస్తే రూ.6లక్షలు జమచేస్తామని అందులో ఉంది. తర్వాత దొర ఖాతాలో నగదు వేశామని ఫేక్‌ మెసేజీలను పంపించారు. అయితే దొర స్పందించకపోవడంతో అసభ్య పదజాలంతో తిట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా +917430572125, +9184264 89012, +919056098755 హెల్ప్‌లైన్‌ నంబర్‌ పేరుతో శ్రీకాళహస్తి వాసులకు తరచుగా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి. వీటిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆన్‌లైన్‌ మోసగాళ్ల ముఠా ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు కోరుతున్నారు.
చదవండి:
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు 
కృష్ణా జిల్లా మంటాడలో దారుణం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement