సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణ బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి, ఆ రోజు రాత్రి అక్కడే గడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు హసన్‌ను విచారించారు. హత్యకు ముందు పెద్ద అంబర్‌పేటలో మద్యం తాగి.. అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతాలకు వచ్చిన తర్వాత హరి యువతితో సహజీవనం విషయాన్ని నవీన్‌కు తెలిపాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య తగాదా జరిగిందని హరే తనతో చెప్పాడని హసన్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది.
‘‘దీంతో ఇద్దరి మధ్య తగువులాట జరిగింది, గొడవ పెద్దది కావటం, అప్పటికే నవీన్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్న హరి మద్యం మత్తులో నవీన్ గొంతు నులుమి హత్య చేశాడు. నవీన్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత హరి పైశాచికత్వంతో శరీర భాగాలను వేరు చేయాలని భావించాడు.. నవీన్ మృతదేహాన్ని ఎవరూ గుర్తించకూడదనే ఉద్దేశంతోనే చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కత్తితో కోసి, ధ్వంసం చేసినట్లు హరి తనతో వివరించాడని’’హసన్ పోలీసులకు తెలిపాడు.
యువతి సెల్‌ఫోన్‌లో కీలక ఆధారాలు..
ఈ కిరాతక హత్య కేసులో యువతి పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. యువతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలను గుర్తించినట్లు సమాచారం. హత్య అనంతరం హరి.. నవీన్ శరీర భాగాలను వేరు చేసే వీడియో, ఫొటోలను యువతికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా భయానక దృశ్యాలను చూసిన యువతి అస్వస్థతతకు గురైనట్లు సమాచారం.
ఆయా వివరాలను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తొలుత నవీన్‌తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన యువతి.. కొన్నేళ్ల తర్వాత నవీన్‌ను దూరం పెట్టింది. ఆ తర్వాత నిందితుడు హరిహర కృష్ణతో రిలేషన్‌షిప్ కొనసాగించింది. అయితే ఈ వ్యవహారం నవీన్‌కు తెలియకపోవటంతో.. తరుచూ యువతికి ఫోన్ చేయడం, సందేశాలు పంపించేవాడని పోలీసుల విచారణలో బయటపడింది.
నవీన్ వ్యవహారాన్ని హరితో యువతి చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు గోప్యత పాటించింది? దురుద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే హరి, నవీన్‌లు అప్పటికే స్నేహితులు. యువతితో హరి కలిసి ఉన్న క్రమంలో అమ్మాయికి నవీన్ పదే పదే ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన హరి.. నవీన్ బతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే అక్కసుతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఓ పోలీసు అధికారి తెలిపారు.
హరిని కస్టడీకి కోరిన పోలీసులు
రంగారెడ్డి కోర్టులు: కేసును లోతుగా విచారించేందుకు నిందితుడు హరిని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కేసుని బుధవారానికి వాయిదా వేసిందని ఏసీపీ శేరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిందితుడితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయవలసి ఉందని, హత్యకు సంబంధించి నిందితుడికి మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరపాల్సి ఉందని ఏసీపీ చెప్పారు. మృతుడి సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకోవడంతో పాటు నిందితుడి సెల్ ఫోన్‌ని కూడా స్వాధీనపర్చుకోవాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment