సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ వరదలో మునిగింది. శనివారం రాత్రి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. చాలా చోట్ల పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. కాగా మణికొండలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. బంగారు ఆలయం రోడ్డులో నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తి ఒక చోట అడుగుపెట్టగా గుంత ఉండడంతో ఆ గుంతలో పడిపోయాడు. వరద భారీగా ఉండడంతో ఆ వరదలో కొట్టుకుపోయాడు.
డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు కోసం ఇక్కడ పెద్ద ఎత్తున గుంతలు తవ్వారు. భారీ వర్షం పడడంతో వర్షపు నీరుతో గుంతలు నిండిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి గుంత ఉన్నట్టు తెలియకపోవడంతో అక్కడ అడుగు పెట్టగా ఒక్కసారిగా నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు. నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. కాగా ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మణికొండ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి సబితారెడ్డి తెలిపారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఘటన స్థలాన్ని ఆమె సందర్శించి గాలింపు చర్యలను వేగం పెంచారు. వ్యక్తి ఎవరనేది గుర్తిస్తున్నామని, గాలింపు చర్యల్లో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఎక్కడైనా పనులు చేస్తుంటే అక్కడ బారికేట్లు పెట్టాలని అధికారులను సూచిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనతో అధికారులను అప్రమత్తత చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం.. వీలైనంత త్వరగా వ్యక్తిని గాలించి పట్టుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment