
నాగలక్ష్మి (ఫైల్)
చైతన్యపురి(హైదరాబాద్): ‘భర్త, అత్త వేధింపులు తట్టుకోలేను.. విడిపోయి ఒంటరిగా బతకలేను...అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరూర్‌నగర్ ఎస్‌ఐ మాధవరావు, మృతురాలి కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ ఆనంద్‌నగర్‌కు చెందిన వ్యాపారి రాపోలు జనార్ధన్, జయమ్మల ఏకైక సంతానం నాగలక్ష్మి (36) బీటెక్ పూర్తి చేసింది. 2015లో దేవరకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్‌తో పెళ్లైంది.
చదవండి: భర్తను పచ్చడి బండతో కొట్టి చంపిన భార్య
వివాహ సమయంలో 25 తులాల బంగారం, రూ.4 లక్షలు కట్నంగా ఇచ్చారు. సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో శ్రీకాంత్, నాగలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు చరణ్‌జిత్ ఉన్నాడు.పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం నాగలక్ష్మిని భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తుండేవారు. నాగలక్ష్మిని తల్లిగారింటికి, బంధువుల ఇళ్లకు వెళ్లనిచ్చేవాడు కాదు.
ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది శనివారం సాయంత్రం నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్య చేసుకుందని శ్రీకాంత్ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది.
మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అల్లుడు తమ కూతుర్ని ఏనాడూ భార్యలా చూడలేదని, అందంగా లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు జనార్ధన్, జయమ్మ తెలిపారు. ఇల్లు కొనేందుకు డబ్బులు కావాలని గొడవ చేస్తూ శాడిస్టులా వ్యవహరించేవాడని వారు వాపోయారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment