![HYD: Man Threat To Kill And Push Wife Into Prostitution Chandrayangutta - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/hyd-2.gif.webp?itok=kRgAZnsw)
సాక్షి, హైదరాబాద్: కడదాక తోడుంటానంటూ కట్టుకున్న భార్యనే వ్యభిచార కూపంలోకి దింపాడో ప్రబుద్ధుడు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సాదిక్ (34) గతంలోనే వివాహం జరగగా..2019లో పహాడీషరీఫ్‌కు చెందిన మహిళ(25)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచే సాదిక్ రెండో భార్యను చంపుతానంటూ బెదిరించి బయటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయించడం మొదలెట్టాడు. ఇది నచ్చని ఆమె భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకుంది.
తాజాగా ఈ నెల 2న ఆమె సరూర్‌నగర్ పరిధిలో స్నేహితులతో కలిసి రోడ్డుపై ఉండటాన్ని గమనించిన సాదిక్ కొట్టాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా గురువారం పహాడీషరీఫ్‌లోని అత్తగారింట్లో భార్య లేని సమయంలో అత్తని బెదిరించి కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు బలవంతపు వ్యభిరారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. అతని చెర నుంచి క్షేమంగా బాలుడిని విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సున్నితమైన కేసు కావడంతో వివరాలు మీడియాకు వెల్లడించలేమని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ కె.కిరణ్ కుమార్ తెలిపారు.
చదవండి: పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు
Comments
Please login to add a commentAdd a comment