సాక్షి, హైదరాబాద్: చుండూరి వెంకట కోటి సాయికుమార్... రూ.64 కోట్లతో ముడిపడి ఉన్న తెలుగు అకాడమీ కుంభకోణంలో కీలక సూత్రధారి. వెంకట రమణ, సోమశేఖర్ సహా మరికొందరితో కలిసి 2015 నుంచి ఈ తరహా స్కామ్స్ చేస్తున్నాడు. ఈ గ్యాంగ్ అరెస్టు కావడం, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే పంథాలో నేరాలు చేయడానికి సరైన నిఘా లేకపోవడమే కారణమని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సాయి కుమార్ సహా తెలుగు అకాడమీ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరవాలని నిర్ణయించారు. (చదవండి: పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..)
► రౌడీలపై రౌడీషీట్, చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్, సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్, భూకబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరవడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఇదే తరహాలో పదేపదే నేరాలు చేస్తున్న మోసగాళ్ల పైనా సస్పెక్ట్ షీట్స్‌ను తెరుస్తున్నారు.
► ఇప్పటి వరకు అసాంఘికశక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్స్‌లో స్వల్ప మార్పులతో సీసీఎస్ అధికారులు ఈ సస్పెక్ట్ షీట్లు నమోదు చేస్తున్నారు. వీటిలో సదరు నేరగాడికి సంబంధించిన ఫొటో, చిరునామా, నమోదై ఉన్న కేసులు, నేరం చేసే విధానం సహా పూర్తి సమాచారం పొందుపరుస్తారు.
► ఈ వివరాలను సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసుస్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఆయా చోట్ల పోలీసు అధికారులు మారినప్పటికీ వీరిపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు.
► సస్పెక్ట్ షీట్ తెరిచిన తరవాత సాయి కుమార్ సహా ఇతర కీలక నిందితులపై స్థానిక పోలీసుల నిఘా కొనసాగుతుంది. మరోపక్క గస్తీ బృందాలు సైతం అనునిత్యం వారి ఇళ్లకు వెళ్లి కార్యకలాపాలు, కదలికల్ని పరిశీలిస్తుంటారు. సీసీఎస్ పోలీసులు సైతం కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈ నిందితుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
► ఇలాంటి షీట్లను తెరవడానికి సదరు కార్యాలయానికి పోలీసుస్టేషన్ హోదా ఉండటం తప్పనిసరి. సీసీఎస్‌తో పాటు సైబర్ క్రైమ్ ఠాణాకు సైతం ఈ హోదా ఉంది. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటు ఆధారంగానే సాయి, వెంకట రమణ తదితరులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నారు. (చదవండి: తెలంగాణ జైళ్లలో యువత; ఉజ్వల భవిత.. ఊచల వెనక)
► మరోపక్క తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన కీలక నిందితుల్లో బయటి రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి నేర చరిత్ర లేని వీరు బయటి ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై ఇక్కడ షీట్ తెరిచినా ఉపయోగం లేదు.
► దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇలాంటి నేరగాళ్ళపై షీట్లు తెరవడంతో పాటు ఆ వివరాలను వారు నివసిస్తున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలోని వస్తుందో ఆ జిల్లా ఎస్పీలకు లేఖ ద్వారా నివేదించనున్నారు. అందులో నేరగాడి చరిత్ర రాయడంతో పాటు నిఘా ఉంచాల్సిందిగా కోరనున్నారు.
► ఈ తరహా మోసాలకు పాల్పడిన సస్పెక్ట్ షీటర్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లలో ఉంచడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం సాధ్యం కాదనే వాదన ఉంది. సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరిచూసుకోవడం సాధ్యం కాదు.
► ఇలాంటి వారి వివరాలను పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఎవరికైనా వీరిపై అనుమానం వస్తే సరి చూసుకోగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment