సిటీలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు ప్రారంభించాం. వచ్చే ఏడాది జోనల్ స్థాయిలోనూ సైబర్‌క్రైమ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తాం. నగరంలో నివసిస్తున్న రోహింగ్యాలపై పూర్తి నిఘా ఉంచాం. న్యూ ఇయర్ వేడుకలపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఈ ఏడాది మొత్తం 109 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. రాజధానిలో మాదకద్రవ్యాల కేసులు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది సిటీలో 3 లక్షల 61 వేల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. ఇక 80 శాతం నేరాలు టాస్క్‌ఫోర్స్ టీమ్స్ వల్లే కొలిక్కి వచ్చాయి. – అంజనీకుమార్, సీపీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాల కారణంగా ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు జోనల్ స్థాయిలో సైబర్ క్రైమ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది వీటిని అమలులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సోమవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో నేర గణాంకాలను పోలీసు కమిషనర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నగరంలో న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం, ఇతర విభాగాలు, అధికారులతో సంప్రదింపులు జరిగినా అనుమతించడమా? నిషేధించడమా? అన్నది స్పష్టం చేస్తాం.
సిటీలో ఉన్న రోహింగ్యాలపై పూర్తి నిఘా ఉందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ బారినపడి ప్రాణాలు వదిలిన సిటీ పోలీసుల కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని అంజనీకుమార్ అన్నారు. గణనీయమైన సేవలు అందించిన లేక్ పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యలకు యత్నించిన 377 మందిని కాపాడారని చెప్పారు. ఈ ఏడాది ఓ సైబర్ నేరగాడు, ఐదుగురు మోసగాళ్లు సహా మొత్తం 109 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
‘ఉడ్తా’ హైదరాబాద్..
రాజధానిలో మాదకద్రవ్యాల కేసులు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. వీటికి బానిసలుగా మారుతున్న వారిలో అత్యధికులు యువకులే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ నుంచి గంజాయి, ఉత్తరాది నుంచి ఇతర మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయి.
డ్రంక్ డ్రైవింగ్ కేసులు ఇలా..
కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో కొరడా ఝుళిపించలేకపోయారు. అయినప్పటికీ కేసులు వేలల్లో, జైలు శిక్షలు పడిన వాళ్లు వందల్లో ఉన్నారు.
‘ఫోర్స్’ చూపిన ‘టాస్క్’..
నగర పోలీసు కమిషనర్ పరిధిలో ఏ సంచలనాత్మక, కీలక నేరం జరిగినా వెంటనే రంగంలోకి దిగేది టాస్‌్కఫోర్స్ పోలీసులే. ఈ విభాగంలో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. నగరంలో నమోదవుతున్న కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలకు చెక్ పెట్టడంలో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్ ద్వారానే కొలిక్కి వచ్చాయి.
‘పెద్ద’గానే పెట్టీ కేసులు..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బ్రేకెన్ విండో థియరీ అమలైంది. చిన్న నేరాలను నియంత్రిస్తూ పోతే.. పెద్దవి వాటంతట అవే తగ్గుతాయి అనేది దీని సారాంశం. ఈ విధానాన్ని సిటీలోనూ అమలు చేస్తూ ఈ–పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. న్యూసెన్స్, బహిరంగంగా మద్యం తాగడం, సమయానికి మించి దుకాణాలు తెరిచి ఉంచడం ఇలాంటి వాటిపై పెద్ద సంఖ్యలోనే రిజిస్టర్ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 2,68,361 నమోదయ్యాయి.
సీసీ కెమెరాలు..
నేరాలు నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్న నగర పోలీసు విభాగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం, అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడం చేస్తోంది. ఫేషియర్ రికగ్నైజేషన్ సిస్టమ్ వంటి సాఫ్ట్‌వేర్స్ వాడుతూ అనుమానితులు, నిందితులతో పాటు మిస్సింగ్ పర్సన్స్‌ను గుర్తిస్తోంది. సిటీలో ఈ ఏడాది వరకు మొత్తం 3,61,787 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి.
సీసీఎస్ పరిధిలో..
నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటిది. దీని ఆ«దీనంలోనే సైబర్ క్రైమ్ ఠాణా, ఉమెన్ పోలీసుస్టేషన్ తదితరాలు ఉన్నాయి. వాటిలో నమోదైన కేసులు, దర్యాప్తు పూర్తయినవి ఇలా.. సీసీఎస్, సిట్‌ల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా.. 150 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. అలాగే ఉమెన్ పోలీసుస్టేషన్‌లో 673 రిజిస్టర్ కాగా.. 589 దర్యాప్తు పూర్తయ్యాయి.
ఈ ఏడాది సైబర్ నేరాలే పెరిగాయి
సిటీలో ఈ ఏడాది అన్ని రకాలైన నేరాలు తగ్గగా.. కేవలం సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. బ్యాంకు అధికారులుగా ఫోన్లు చేసి ఓటీపీలు తెలుసుకుని స్వాహా చేసే జామ్‌తార క్రైమ్ 50 శాతం వరకు ఉంటోంది. ఆ తర్వాత ఓఎల్‌ఎక్స్‌లో పోస్టుల ఆధారంగా జరిగే భరత్‌పూర్ క్రైమ్, ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కలర్ ప్రిడెక్షన్ అనే ఆన్‌లైన్ గేమ్ గుట్టురట్టు చేశాం. రెండు కేసులకు సంబంధించి రూ.1,600 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో ఓ చైనీయుడి సహా 14 మందిని అరెస్టు చేశాం. 107 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.80 కోట్లు ఫ్రీజ్ చేశాం.
– షికా గోయల్, అదనపు సీపీ(నేరాలు)
Comments
Please login to add a commentAdd a comment