ఆస్పత్రి వద్ద హైడ్రామా
భారీగా మోహరించిన పోలీసులు
మృతుడి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
జిలానీతో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సుమారు 15 మంది వరకు రషీద్‌ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్‌లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు.
రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు
హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్‌లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్‌లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్‌సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు.
అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment