నాగచైతన్య, కోటిరెడ్డి (ఫైల్)
సాక్షి, ఒంగోలు/చందానగర్: కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించరని మనస్తాపం చెందిన ప్రేమజంట హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి మృతిచెందగా, గాయాలైన యువకుడు భయపడి ఒంగోలు జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. యువకుడు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంట్యాలకు చెందిన గాదె కోటిరెడ్డి ఒంగోలులోని జిమ్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒంగోలు మండలం కరవది ప్రాంతానికి చెందిన జి.నాగచైతన్యతో (జిమ్స్‌లోనే నర్సు) పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. కులాంతర వివాహం కావడంతో కోటిరెడ్డి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య హైదరాబాద్ చేరుకుని అక్కడ సిటిజన్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 22న కోటిరెడ్డి హైదరాబాద్ చేరుకున్నాడు. బాచుపల్లిలో తన సోదరి ఇంట్లో ఉండి 23వ తేదీ నాగచైతన్యను కలిశాడు. డ్యూటీ అనంతరం ఆమెతో కలిసి షాపింగ్‌కు వెళ్లి కత్తిని కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి నల్లగండ్లలోని ఎస్‌వీఆర్ గ్రాండ్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించరని స్పష్టతకు వచ్చి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నాగచైతన్య కత్తితో గొంతుపై, కడుపులో పొడుచుకుని పడిపోయింది. దీంతో కోటిరెడ్డి కూడా కత్తితో గొంతుమీద పొట్టలో పొడుచుకుని పడిపోయాడు.
చదవండి: (టీలో నిద్రమాత్ర వేసి.. మత్తులోకి వెళ్లగానే అత్యాచారం)
ఉదయం 10.30 గంటల సమయంలో కోటిరెడ్డికి మెలకువ వచ్చి చూడగా నాగచైతన్య స్పృహలో లేదు. ఫ్యానుకు ఉరేసుకునేందుకు విఫలయత్నం చేశాడు. భయంతో రెంట్యాలలోని ఇంటికి చేరుకుని బంధువులకు విషయం చెప్పాడు. అంతా కలిసి రెంట్యాల పోలీసుల వద్దకు వెళ్లగా వారు చందానగర్ ఎస్సైతో మాట్లాడారు. మరోవైపు సాయంత్రం వరకు హోటల్ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో నిర్వాహకులు గది తెరచి చూడగా అందులో నాగచైతన్య రక్తపు మడుగలో చనిపోయి ఉంది. దీంతో వారు చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
నాగచైతన్య చనిపోయిందని స్పష్టం కావడం, కోటిరెడ్డి గాయాలతో ఉండటంతో తొలుత చికిత్స చేయించాలని చందానగర్‌ఎస్సై సూచించారు. దీంతో బంధువులు అతనిని సోమవారం ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. అయితే 24వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో కత్తితో శరీరంపై రెండు చోట్ల గాయాలు చేసుకున్న వ్యక్తి 25వ తేదీ ఉదయం 4గంటలకు జీజీహెచ్‌లో చేరేంత వరకు ఏంజరిగిందనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం కోటిరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.
చదవండి: (అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment