
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఒకరంటే ఒకరికి ప్రాణం.. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అయితే ఆ యువజంట ఆనందం కొద్ది గంటలు కూడా నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో నూతన జంటను కాలం బలి తీసుకుంది. తల్లిదండ్రులకు తమ పెళ్లి విషయం చెబుదామని బయల్దేరారు. వారి ఆశీస్సులు తీసుకునే లోపే ఈ జంట మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్ (24), హైద రాబాద్‌లోని గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ (22) గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటు న్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించా లని అనుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమ యంలో పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత సతీశ్ స్వగ్రామమైన మోడెగాం గ్రామానికి బయ ల్దేరారు. అయితే, సదాశివనగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో జాతీయ రహదారి దాటు తుండగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. కాగా, వీరు హైదరాబాద్ నుంచి ఏ వాహనంలో వచ్చారో స్పష్టత లేదు.
మోడెగాం గ్రామానికి వెళ్తూ పోలీసుల సాయం కోరేందుకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, మహిమను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నవదంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వర్కర్.
Comments
Please login to add a commentAdd a comment